జీరో బడ్జెట్ పాలిటిక్స్! పైసా తీయని జనసేన అభ్యర్థులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలను విచిత్రంగా ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు పాటిస్తున్నారు.

Update: 2024-04-10 02:03 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో ప్రవచించిన జీరో బడ్జెట్ రాజకీయాలను విచిత్రంగా ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు పాటిస్తున్నారు. ప్రత్యర్థులైన వైసీపీ అభ్యర్థులు ప్రతిరోజు లక్షల్లో ఖర్చు చేస్తూ ప్రచారంలో దుమ్ము రేపుతుంటే జనసేన అభ్యర్థులు ఇదిగో అదిగో.. అంటూ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. స్థానిక నేతలైవరైనా ఖర్చు చేస్తే వచ్చి ప్రచారం చేసుకొని వెళ్లిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థుల్లో ముగ్గురికి టికెట్లు ఖరారై జోరుగా ప్రచారం ప్రారంభమైన తరువాత కూడా పైసా తీయకుండా పైపైనే కాలక్షేపం చేస్తున్నారు. అది అటు ఎంపీ అభ్యర్థులను, ఇటు కూటమి పక్షాల నేతలను కలవరపరుస్తోంది. జనసేన తరపున అనకాపల్లి నుంచి సీటు పొందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మినహా మిగిలిన ముగ్గురు జనసేన అభ్యర్థుల పరిస్థితి ఇలాగే వుంది. వీరు నిధులు బయటకు తీసి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించని కారణంగానే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీరి నియోజకవర్గాలలో ప్రచారానికి రాలేదని, ఇచ్చిన షెడ్యూలు కూడా రద్దు చేసుకొన్నారని అంటున్నారు.

జనంలోకి ఖాళీ చేతులతో..

ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన టికెట్ లు పొందిన పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి), సుందరపు విజయకుమార్ (యలమంచలి), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ దక్షిణ)లు టికెట్లు అడిగినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుచేయగలమని పార్టీకి చెప్పారు. తీరా టికెట్ వచ్చాక ప్రతిరోజూ పక్కన తిరిగే కార్యకర్తలు, నేతలకు కూడా ఏమీ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఇందులో పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు కేవలం టికెట్ కోసమే వైసీపీ నుంచి చివరి నిముషంలో జనసేనతో చేరి టికెట్లు పొందారు. వీరి మాటలు నమ్మి ఎన్నో సంవత్సరాలుగా ఆయా నియోజక వర్గాలలో టికెట్ ఆశతో పనిచేస్తున్న జనసేన నేతలను పక్కన పెట్టి వీరికి అధిష్టానం టికెట్లు కేటాయించింది. అంతా అయ్యాక ఖర్చుకు వెనుకాడడం, ఇదిగో అదిగో..రేపు మాపు .. అంటూ కాలక్షేపం చేస్తుండడం క్యాడర్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

అనకాపల్లిలో బీజేపీ, విశాఖలో టీడీపీ సొమ్ముతో షో

అనకాపల్లి లోక్ సభ నుంచి బీజేపీ తరపున ఎంపీగా బలమైన నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండడంతో దాని పరిధిలోకి వచ్చే పెందుర్తి, యలమంచలి అసెంబ్లీలలో ఆయన వచ్చినప్పుడు జరిగిన కార్యక్రమాలు హైలైట్ అయ్యాయి. అంతేగానీ జనసేన అభ్యర్థులైన రమేష్ బాబు, విజయకుమార్‌లు ఇప్పటి వరకూ గట్టిగా ప్రభావం చూపే కార్యక్రమం ఒక్కటీ చేయలేదు. ఇక విశాఖ పార్లమెంటు పరిధిలోని విశాఖ దక్షిణ నియోజక వర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షుడు గండి బాబ్జీలతో జరిపిన కార్యక్రమాలు హైలైట్ అయ్యాయి. టికెట్ ఆశించి రాకపోవడంతో తెలుగుదేశంలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సొంత ఖర్చుతో ఐదు వేల మందితో జనసేన అభ్యర్థికి మద్దుతుగా చేసిన ర్యాలీనే ఇప్పటి వరకూ దక్షిణలో జరిగిన అతిపెద్ద కార్యక్రమం.

ఇప్పటికీ ప్రారంభం కాని ఇంటింటా ప్రచారం

ఆ మూడు నియోజక వర్గాలలో జనసేన అభ్యర్థుల తరపున ఇంటింటా ప్రచారం ఇప్పటికే ప్రారంభం కాలేదు. వైసీపీ ప్రత్యర్థులు ఇంటింటా ప్రచారం ప్రారంభించి మహిళా కార్యకర్తలతో బొట్టు, మెహందీ వంటి కార్యక్రమాలు చేస్తుండగా జనసేన అభ్యర్థులు పూర్తిగా వెనుకబడి పోయారు. అభ్యర్థులలో ఇద్దరు అనకాపల్లి, విశాఖ జిల్లాల జనసేన విభాగాలకు అధ్యక్షులుగా వున్నారు.

రంజాన్‌ను పట్టించుకోలేదు

అభ్యర్థులుగా కాదు కదా.. చివరకు పార్టీ జిల్లా అధ్యక్షుల హోదాలో కూడా వీరు రంజాన్ సందర్భంగా ప్రత్యర్థులకు దీటుగా ముస్లింలకు తోఫా, ఇఫ్తార్, సహర్ ఇవ్వడం వంటివేమీ చేయలేకపోయారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ వంటి పార్టీలన్నీ ఉగాది సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఉత్సవాలు నిర్వహించగా అనకాపల్లి అధ్యక్షుడిగా రమేష్ బాబు, విశాఖ అధ్యక్షుడిగా వంశీ అటువంటి వేమీ చేయలేదు. వంశీ ఇంట్లో కొద్ది మంది కార్యకర్తలతో చేసుకొన్నారు. ఎన్నికల సమయంలో రంజాన్, ఉగాది వంటి ఉత్సవాలను ఓట్లుగా మలచుకొనే ప్రయత్నాలను వైసీపీ చేస్తున్నప్పటికీ వీరు చూస్తూ ఊరుకుండిపోవడం గమనార్హం.

కలవర పడుతున్న ఎంపీ అభ్యర్థులు

ఎన్నికల సమయంలో కూడా చురుగ్గా లేకుండా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా వున్న జనసేన అభ్యర్థులను చూసి ఎంపీ అభ్యర్థులు కలవర పడుతున్నారు. వీరి వైఖరి కారణంగా తమకు ఇబ్బందులు తప్పవేమో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. సహజంగా డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా వుండే కొణతాల రామకృష్ణ అంచనాలకు భిన్నంగా దూసుకుపోతుంటే, పవన్ సభను దిగ్విజయం చేస్తే వీరు ఇలా నిర్లిప్తంగా వుండడమేమిటో అర్థం కావడం లేదు. చివరు ఈ జీరో బడ్జెట్ రాజకీయాలు ఏ ఫలితాలనిస్తాయో వేచి చూడాల్సిందే.


Similar News