గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ఎల్లో మీడియా ఓర్చుకోలేకపోతోంది..!
విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ప్రపంచమంతా
దిశ, పిఠాపురం : విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తుంటే ఎల్లోమీడియా ఓర్చుకోలేకపోతుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్ విజయవంతం కావడంపై పిఠాపురంలోని ఆయన కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దొరబాబు 13 లక్షల కోట్ల పెట్టుబడులతో 352కి పైగా ఎమ్ఓయూలు కుదుర్చుకోవడం చాలా శుభపరిణామమన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే జగన్ కర్తవ్యంగా పెట్టుకున్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేని సంక్షేమ పథకాలను పేదలకు అందించిన ఘనత జగన్‌కు మాత్రమే దక్కుతుందన్న దొరబాబు.. రాబోవు కాలంలో పేదల కోసం జగన్ చేసే పనులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
పెట్టుబడుల దాటికి ప్రతిపక్షాలు డీలా
ఒకేసారి ఎన్నడూ లేని విధంగా 13 లక్షల కోట్లకు ఎమ్ఓయూలు కుదుర్చుకుంటే జగన్ దాటికి ప్రతిపక్షాలు డీలా పడిపోయాయని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే దొరబాబు. ఒకేసారి ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తలు విశాఖ సమ్మిట్‌కు వస్తే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు ఏం చేయాలో పాలుపోలేదన్నారు. కేవలం జగన్‌ను వ్యతిరేఖంగా చూపడం తప్పితే ఎల్లో మీడియాకు వేరే పనిలేదన్నారు. తాము ప్రజలకు ఏం చేయాలనే దానిపై మాత్రమే ఆలోచిస్తున్నాం తప్ప, ప్రతిపక్షాల విమర్శలు తాము పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. పెద్ద ఎత్తున విశాఖకు తరలివచ్చిన పారిశ్రామికవేత్తలంతా జగన్ ఇచ్చిన మర్యాదకు ఫిదా అయిపోయారన్నారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.