AP News:వెల్ఫేర్ కార్యాలయం సిబ్బంది నిర్భంధం..ఎందుకంటే?
వైసీపీ నేత, మాజీ శాసనసభ్యుడు మళ్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ గ్రూప్ తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇచ్చేవరకూ కదిలేది లేదని బాధితులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: వైసీపీ నేత, మాజీ శాసనసభ్యుడు మళ్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ గ్రూప్ తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇచ్చేవరకూ కదిలేది లేదని బాధితులు రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. యాజమాన్యం తమను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఏకంగా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని వస్త్రాలతో కట్టేసి మూసేశారు. సిబ్బంది విజ్ఞప్తి చేయడంతో రాత్రి ఏడున్నర ప్రాంతంలో తలుపులు తీసి వారిని బయటకు పంపించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగించిన గుడివాడ బాధితులు పోలీసుల జోక్యంతో విరమించి గురువారం ఉదయం తిరిగి ప్రారంభించారు.
సిబ్బంది తమ వద్ద చెక్‌లు లేవని చెప్పడంతో ఆన్‌లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ బకాయిలను చెల్లించేంతవరకూ విశాఖ నుంచి కదిలేది లేదని భీష్మించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ పార్టీ నేత అయిన సంస్థ చైర్మన్ విజయ ప్రసాద్‌కు మద్దతు పలికిన పోలీసులు ఇప్పుడు ఆ పని చేయలేక పోతున్నారు. విజయ్ ప్రసాద్ గానీ ఆయన తరపున డైరక్టర్లు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తామంతా గుడివాడ ప్రాంతం నుంచి ప్రతి నెల రైలులో వచ్చి వెళ్లడం తప్ప మేము కట్టిన డబ్బులకు మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని బాధితుల తరపున బాలాజీ కోరారు. సంస్థ వారు పట్టించుకోవడం లేదని, పాలసీలు కట్టిన మాకు ఇప్పటి వరకు రూ. 70 లక్షలు వరకు చెల్లించాలని, తీరా ఇప్పుడు మీరు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామని, వడ్డీ ఏమి ఇవ్వలేమని చెబుతున్నారన్నారు. చెక్‌లు నెల తర్వాత వస్తాయన చెప్పడమేమిటంటూ మండిపడ్డారు.