AP News:వచ్చే నెలలో ‘తాండవ’ ఆయకట్టుకు నీరు విడుదల

ఉమ్మడి విశాఖ జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ ఆయకట్టు రైతుల సూచన మేరకు వచ్చే నెల 15 నుంచి 20 తేదీల మధ్యలో భూములకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తామని రిజర్వాయర్ డీఈఈ అనురాధ పేర్కొన్నారు.

Update: 2024-07-26 09:25 GMT

దిశ ప్రతినిధి,అనకాపల్లి:ఉమ్మడి విశాఖ జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ ఆయకట్టు రైతుల సూచన మేరకు వచ్చే నెల 15 నుంచి 20 తేదీల మధ్యలో భూములకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తామని రిజర్వాయర్ డీఈఈ అనురాధ పేర్కొన్నారు. నాతవరం, తాండవ ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం తాండవ నుంచి నీరు విడుదల పై ఆయకట్టు రైతులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ అనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయి 380 అడుగులకు గాను 371 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు.

దీనిని సరఫరా చేస్తే 60 రోజులకు సరిపోతుందన్నారు. ఇలా నీరు సరఫరా చేసే రెండు నెలల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఒక వైపు పంటకు నీరెళుతుంటే, మరొక వైపు ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలువలో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు అవసరమైన నిధులకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరైన వెంటనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు గేట్ల నుంచి కొంతమేర లీకవుతున్న నీటిని, తాత్కాలిక మరమ్మతులు చేసి కట్టడి చేశామన్నారు.

వీటికి సంబంధించిన నిధులు మంజూరైన వెంటనే పక్కాగా పనులు పూర్తి చేస్తామన్నారు. మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది రిజర్వాయర్ పరిధిలోని 52 వేల ఎకరాల ఆయకట్టులో కేవలం 30 వేల ఎకరాలకు నీరు అందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏటా చేపట్టే నిర్వహణ పనులకు నిధులు మంజూరు కాక, నీరు చాలావరకు వృధాగా పోయిందన్నారు. అదేవిధంగా కాలువల్లో సైతం పూడిక పెరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు, టీడీపీ నాయకులు నేతల విజయ్ కుమార్, నందిపల్లి వెంకటరమణతో పాటు పలువురు ఆయకట్టు రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News