Visakha: ముగ్గురు హిజ్రా వైద్యులకు ఘన సత్కారం
అనుకున్న లక్ష్యం సాధించడానికి లింగ బేధం, అంగవైకల్యం అడ్డు కాదని ముగ్గురు హిజ్రాలు వైద్యులయి నిరూపించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు...
దిశ, ఉత్తరాంధ్ర: అనుకున్న లక్ష్యం సాధించడానికి లింగ బేధం, అంగవైకల్యం అడ్డు కాదని ముగ్గురు హిజ్రాలు వైద్యులయి నిరూపించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. "హ్యాపీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ జెండర్ డే" పురస్కరించుకుని సంరక్షణ సంక్షేమ సంఘం నేతృత్వంలో విశాఖ సవేరా ఫంక్షన్ హాల్‌లో హిజ్రా డాక్టర్లు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్, డాక్టర్ మిత్రాలను ఆమె ఘనంగా సత్కరించారు. ప్రసంగిస్తూ లింగ వివక్షతకు గురవుతూ ఎవరి ప్రమేయం లేకుండా హిజ్రాలు వైద్యులు కావడం అభినందనీయ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు హిజ్రాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి, హిజ్రా వైద్యులను సత్కరించడం, ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. గతంలో అసెంబ్లీలో పిన్నింటి వరలక్ష్మి హిజ్రాల సమస్యల కోసం ప్రస్తావించారని గుర్తు చేశారు. తన వంతు సహాయ సహకారాలు ఇటువంటి కార్యక్రమానికి అందిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రముఖ వైద్యులు ప్రేమ ఆసుపత్రి చైర్పర్సన్ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ వైద్యరంగంలో ముగ్గురు హిజ్రాలు రాణించడం అరుదు అన్నారు. అసలు మెడిసిన్ చదవడం యజ్ఞం లాంటిదని, వివక్షలకు గురవుతూ వైద్యులు అయ్యారని వారిని అభినందించారు.
ముగ్గురు హిజ్రా వైద్యుల్లో డాక్టర్ రూత్ జాన్ పాల్ మాట్లాడుతూ హిజ్రాగా సమాజంలో మెలగడం కష్టమని తెలిపారు. నిత్యం వేధింపులకు గురైన చదువు ఆపలేదని, ఒకటి నుండి 12 తరగతి వరకు మొదటి స్థానంలో ఉన్నానన్నారు. తనకు వచ్చిన మార్కులను బట్టి మెడిసిన్ సీటు వచ్చిందని, అన్నయ్య, కుటుంబ సహకారం ఇందుకు కారణమన్నారు. తమ కమ్యూనిటీ సహకారంతో వైద్యులమై ఉస్మానియా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నామని, తమను అర్థం చేసుకొని రోగులు సహకరిస్తున్నారని తెలిపారు.
మరో హిజ్రా వైద్యులు ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ పాఠశాల నుండి కళాశాల చదువు వరకు నిత్యం వివక్షతకు గురయ్యానన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించడం జీవితంలో రెండో ప్రయాణం అని తెలిపారు. మత గ్రంథాల్లో ఎక్కడ హిజ్రాలపై వివక్షత చూపించాలని లేదని, సమాజంలో ఉండడం బాధాకరమని తెలిపారు. హిజ్రాల సమస్యల కోసం కృషి చేస్తున్నానని, మహిళల పురుషుల టాయిలెట్స్‌తో పాటు హిజ్రాలు కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలకు చదువుకునే హక్కు కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్టు వెల్లడించారు.
ఇంకో హిజ్రా వైద్యులు డాక్టర్ మిత్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్య ఆయుధమని, దాని ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని చెప్పారు. కర్ణాటక, తమిళనాడులో హిజ్రాలకు చదువుకునే హక్కు ఉందని, ఆ అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో లేకపోవడం సరికాదన్నారు. ప్రాచీన, మొగలుల కాలంలో హిజ్రాలకు ప్రాధాన్యత ఉండేదని, 1871లో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం వారిని బహిష్కరిస్తూ చట్టం చేసిందని, దానిని నేటికీ కొనసాగిస్తున్నారన్నారు. బ్రిటన్, అమెరికాలో ఆ చట్టాన్ని రద్దు చేశారని, ఇక్కడ రద్దు చేయక పోవడం దారుణం అన్నారు. ఈ సందర్భంగా పలువురు హిజ్రాలు వారిని ఘనంగా సత్కరించి, వారితో ఫోటోలు దిగారు. సంరక్షణ సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి నేతృతంలో జరిగిన కార్యక్రమంలో భారతి, లయ, సౌమ్య, అరుణ, రవి, ఎల్లాజీ, అధిక సంఖ్యలో హిజ్రాలు పాల్గొన్నారు.