Visakha: డబ్బుల కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. సంచలన విషయాలు చెప్పిన సీపీ

డబ్బులు కోసమే ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారని విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ తెలిపారు,..

Update: 2023-06-15 11:58 GMT

దిశ, ఉత్తరాంధ్ర: డబ్బులు కోసమే ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారని విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసును గంటల్లోనే ఛేదించిన పోలీసులు నిందితుడు హేమంత్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు వివరాలను కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు. ఎంపీ కుమారుడు చందుతో పాత పరిచయం ఉండడంతో నిందితులు సులువుగానే కిడ్నాప్‌నకు పాల్పడ్డాడని తెలిపారు.

‘అనంతరం చందు తల్లికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే భర్త ఎంవీవీ సత్యనారాయణకు ఆమె వెంటనే సమాచారం అందించారు. కానీ కొడుకు మీద ప్రేమతో కిడ్నాపర్ హేమంత్‌ డిమాండ్ చేసిన నగదును ఇచ్చేందుకు తల్లి కిడ్నాపర్ల వద్దకు వెళ్లారు. అయితే ఆమెను కూడా బంధించారు. ఇక ఎంపీ ఎంవీవీ తన ఆడిటర్ జి. వెంకటేశ్వరరావుకు విషయాన్ని తెలియ చేసి సమస్యను పరిష్కార మార్గంలోకి తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. కిడ్నాపర్ హేమంత్ రెండు కోట్లు డిమాండ్ చేయడంతో ఒక కోటి 75 లక్షలు ఆడిటర్ జి. వెంకటేశ్వరరావు ద్వారా సమకూర్చారు. ఆ నగదు తీసుకున్న తర్వాత మరింత నగదు కావాలని.. చెప్పిన నగదు తీసుకురాలేదని జి వెంకటేశ్వరరావును కూడా కిడ్నాప్ చేశారు. సదరు ఆడిటర్ జి. వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఎంపీ ఎంవీవీకి అనుమానం వచ్చి చివరిగా పోలీసు అధికారులతో విషయాన్ని చెప్పి వారి సహాయాన్ని తీసుకున్నారు. గురువారం ఉదయం 10గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో అత్యంత జాగ్రత్తగా ఈకేసుపై దృష్టి సారించాం.’ అని సీపీ తెలిపారు.

కిడ్నాపర్ కోలా వెంకట హేమంత్ కుమార్ గతంలో ఎంపీ వద్ద పని చేశాడని, అతని వ్యవహారశైలి నచ్చకపోవడంతో దూరంగా ఉంచారని సీపీ తెలిపారు. హేమంత్‌పై రౌడీ షీట్ ఉందన్నారు. 12 కేసులు నమోదు కాగా, తాజాగా 3 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 2017లో ఒక కిడ్నాప్ మర్డర్ కేసులో హేమంత్ నిందితుడిగా ఉన్నారని సీపీ తెలిపారు.

Tags:    

Similar News