Visakha: స్టైల్ మార్చిన మేయర్.. అవాక్కైన జనం
మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తన పంథా మార్చారు.
దిశ, ఉత్తరాంధ్ర: మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తన పంథా మార్చారు. ప్రతి సోమవారం నేరుగా బస్సులో కార్యాలయానికి వెళ్లిపోకుండా ఈసారి మాత్రం ప్రజల్లోనూ తిరిగేందుకు నిర్ణయించుకున్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఆమె ప్రతి సోమవారం వాహనాన్ని వదిలి ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కార్యాలయానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. జీవీఎంసీ సిబ్బంది కూడా వారానికి ఓ రోజు సొంత వాహనాలు వదిలేసి ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలని ఆమె కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయానికి వెళ్లే సమయంలోనే సోమవారం మరో రెండు కార్యక్రమాలు చేపట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో చిరువ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు వాడడాన్ని మేయర్ గమనించారు. వారితో మాట్లాడి ప్లాస్టిక్‌ను నిషేధించామని, హానికరమైన కవర్లు వాడితే చర్యలు తప్పవని చెబుతూనే గుడ్డ, నార సంచుల వాడకాన్ని పెంచాలని కోరారు.
అదే విధంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ చలివేంద్రం వద్దకు వెళ్లి ఆరా తీశారు. సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు కచ్చితంగా ఉండాల్సిందేనని, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేలా బాట సారులకు మంచి నీళ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికే ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమం ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. వెంటనే స్పందనకు హాజరై మళ్లీ విద్యుత్ వాహనంలో ఇంటికి తిరిగెళ్లారు.
Also Read..