Visakha: గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు 25 దేశాల ప్రముఖులు

విశాఖలో 3,4 తేదీల్లో జరగనున్న పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలి వస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు...

Update: 2023-03-01 14:23 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో 3,4 తేదీల్లో జరగనున్న పారిశ్రామిక సదస్సుకు 25 దేశాల నుంచి ప్రముఖులు తరలి వస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయన్న సమాచారం అందిందన్నారు. 18 విమానాలను విశాఖ ఎయిర్ పోర్ట్‌లో పార్క్ చేసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలించనున్నామని పేర్కొన్నారు. విశాఖకు తరలివస్తున్న ప్రముఖుల్లో అంబానీ, కరణ్ అదాని, కుమార్ మంగళం బిర్లా తదితరులు ఉన్నారని తెలియజేశారు. అందరికీ విశాఖ నగరంలోని వివిధ హోటల్స్‌లో బస ఏర్పాటు చేశామని చెప్పారు.

600 గదుల వరకు సిద్ధం

ఇక నగరంలో వివిధ హోటళ్లలో 600 గదుల వరకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా ఇప్పటివరకు సదస్సులో పాల్గొనేందుకు పదివేల మంది రిజిస్టర్ చేయించుకున్నారని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయని, ఇది రాష్ట్రంలో మేజర్ సెక్టర్ కాబోతోందని ఆయన అన్నారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు. దేశంలో మరి ఎక్కడా లేనివిధంగా 70 శాతం మంది స్కిల్ ఫోర్స్ ఏపీలో ఉందని అన్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి భవిష్యత్తుగా నిలుస్తుందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.

గురువారం విశాఖపట్నం చేరుకోనున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం రాత్రి 8 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని అమర్ నాథ్ తెలియజేశారు. మూడవ తేదీ ఉదయం ఆయన వేదిక వద్దకు వెళ్లి ఎగ్జిబిషన్‌ని తిలకిస్తారని అన్నారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారని ఆ తర్వాత తొలి రోజు కొన్ని ఎంవోయూలు జరుగుతాయని మంత్రి వివరించారు. 4న కూడా ఎంఓయూలు చేస్తారని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డిపై విశ్వసనీయత, నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. చేసుకున్న ఎంవోయుల్లో 90 శాతం వరకు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ప్రముఖులకు అత్యధిక భద్రత

నగరానికి తరలివస్తున్న ప్రముఖులకు అత్యధిక భద్రత కల్పిస్తున్నట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. 11 సెక్టర్లలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరా ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. సదస్సుకు హాజరయ్యే వారికోసం 25 ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. కాగా ప్రధాన వేదికపై సుమారు 50 మంది అతిథులు కూర్చుంటారని, ప్రధాన వేదికలో 4,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

ప్రత్యేక కౌంటర్లలో పాసులు తీసుకోవాలి

సదస్సులో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న వారు 2న ఉదయం 10 గంటల నుంచి సదస్సు జరిగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పాసులు తీసుకోవాలని ఆయన చెప్పారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని 2న సాయంత్రానికి అంతా సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు. కాగా ప్రత్యేక అతిధుల కోసం వండి వడ్డించనున్న వంటకాలను ఒకరోజు ముందుగానే అంటే 2వ తేదీనే యంత్రాంగమంతా రుచి చూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సదస్సుకు వచ్చే అతిధులకు స్థానిక ఎంజీఎం పార్కులో రెండవ తేదీ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఇక్కడ లేజర్ షో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ పరిశీలించారు.

Tags:    

Similar News