ఆపరేషన్ ‘విజయసాయి’ ఆరంభం.. అప్పుడే మారిన బే పార్క్ వాటాలు?

వైసీపీ పాలనా కాలంలో నియంత కంటే దారుణంగా, ఘోరంగా ఉత్తరాంధ్రాను ఏలిన అప్పటి పార్టీ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయిరెడ్డి అరాచకాలు, కబ్జాలు, ఆస్తులు, స్థలాలు, పొలాలు బలవంతంగా లాక్కోవడాలు వంటి వాటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Update: 2024-07-02 05:58 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ పాలనా కాలంలో నియంత కంటే దారుణంగా, ఘోరంగా ఉత్తరాంధ్రాను ఏలిన అప్పటి పార్టీ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయిరెడ్డి అరాచకాలు, కబ్జాలు, ఆస్తులు, స్థలాలు, పొలాలు బలవంతంగా లాక్కోవడాలు వంటి వాటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో ఉత్తరాంధ్రా జిల్లాలైన ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 40 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్ భూములు వైసీపీ పెద్దల పరమయ్యాయని కూటమి ప్రభుత్వంలో ఇందుకోసమే ప్రత్యకంగా పనిచేస్తున్న టీం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ భూములతో పాటు వేల కోట్ల విలువచేసే ప్రైవేటు ఆస్తులను విజయసాయి బృందం బెదిరింపులు, హెచ్చరికలు, అధికార దుర్వినియోగం ద్వారా తమ ఆధీనంలోకి తెచ్చుకొంది. ఈ వివరాలన్నింటినీ సేకరించిన ప్రత్యేక బృందం తదుపరి చర్యల కోసం రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బే పార్క్‌లో మారిన వాటాలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే జగన్ అండతో విజయసాయి విశాఖలో రెచ్చిపోయారు. యజమానులను బెదిరించి బే పార్క్, రాడిసన్ హోటళ్లలో వాటాలను చేజిక్కించుకొన్నారు. తమ వారైన హెరిటో డ్రగ్స్ సంస్థకు రుషికొండ వద్ద సముద్రానికి ఆనుకోని కొండపై ఉన్న బే పార్క్ హోటల్ వాటాలను బదిలీ చేయించారు. దాని ఎదురుగా సముద్రం ఒడ్డున కొత్తగా కట్టిన రాడిసన్ హోటల్ వాటాలను తన అల్లుడు కంపెనీ అయిన అరబిందోకు బదిలీ చేయించారు. ఈ రకంగా వేల కోట్ల ఆస్తుల బదిలీలు జరిగాయి. రాష్ర్టంలో వైసీపీ చిత్తుగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఆస్తుల పాత యజమానులకు ధైర్యం వచ్చింది. ఆస్తులు కాజేసిన వైసీపీ నేతలు కూడా కేసులు, విచారణల భయంతో పరారు కావడంతో పాత యజమానులు మందుకు వచ్చి తమ వాటాలను తిరిగి వెనక్కి తెచ్చుకొంటున్నారు. ఇప్పటికే బే పార్క్ హోటల్ వాటాలు హెటిరో డ్రగ్స్ నుంచి పాత యజమానులకు బదిలీ అయ్యాయని తెలిసింది. ఇదే బాటలో రాడిసన్ వాటాలు కూడా అరబిందో నుంచి వెనక్కి తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎంవీవీ, జీవీల పరారీతో వారి ఆస్తులపై దృష్టి

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సహచరుడు, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.వెంకటేశ్వరరావు(జీవీ) లు వైసీపీ పాలనా కాలంలో వేల కోట్ల విలువైన పొలాలు, స్థలాలు, ఆస్తులను చేజిక్కించుకొన్నారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారవడంతో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ఎంవీవీ చేపట్టిన సీబీసీఎన్‌సీ భూముల్లో పనులను జీవీఎంసీ ఆపేయగా, హయగ్రీవ భూములను ఎంవీవీ, జీవీలు ఫోర్జరీతో లాక్కొన్నారని ఆ సంస్థ యజమాని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో రెండు ఫిర్యాదులపై పోలీసు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. దీంతో అరెస్టు తప్పదన్న భయంతో వారిద్దరూ పరారయ్యారు. దీంతో వారిద్దరితో పాటు వారి నేతృత్వంలో జరిగిన లావాదేవీలపై కూపీ లాగి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

అసైన్డ్ భూములను ఏం చేద్దాం?

వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, బీసీల ఉపాధి కోసం వ్యవసాయం చేసుకొనేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములను జీవో 596 ముసుగులో వైసీపీ పెద్దలు లాగేశారు. వైసీపీ పెద్ద పెద్ద నేతలతో పాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వంటి వారు కూడా వేల ఎకరాలకు అడ్వాన్స్‌లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకొన్నారు. ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో కొందరు తెలుగుదేశం నేతలు కూడా ఉన్నారని తెలిసింది. వీటిల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేందుకు వైసీపీ పెద్దలు, వారి బినామీలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రాలోనే వేల ఎకరాలు 596 జీవో కింద పేదల నుంచి పెత్తందారులు చేతుల్లోకి వెళ్లిపోయింది. అసైన్డ్ చట్టం ప్రకారం భూమి బదిలీ చట్టవిరుద్ధమని, వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ జీవోను రద్దు చేసి భూములను తిరిగి వాటిపాత హక్కుదారులైన దళితులు, బీసీలకు అప్పగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Similar News