AP News:చంద్రబాబు పర్యటన ముందు ఈ దాడులేంటి? విస్తుపోయిన విశాఖ వాసులు

నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం కార్యకర్తలు పత్రిక కార్యాలయం మీద దాడితో స్వాగతం పలికారు.

Update: 2024-07-11 01:45 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం కార్యకర్తలు పత్రిక కార్యాలయం మీద దాడితో స్వాగతం పలికారు. ప్రశాంతతను కోరుకునే విశాఖ వాసులు వైసీపీ అరాచకాలు భరించలేక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల ఓట్ల మెజారిటీ కూటమి పక్షాలకు ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత అని చంద్రబాబు, పవన్‌లు చెప్పిన మాటను విశాఖ వాసులు నమ్మారు. విచిత్రంగా అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా విభాగం , విద్యార్థి విభాగం నేతలు కార్యకర్తలు బుధవారం సాయంత్రం అప్పోఘర్ సమీపంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి వెళ్లి ఏకంగా బోర్డులను ధ్వంసం చేసి దగ్ధం చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసి సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు నిరసన తెలిపి వెనుదిరిగారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తెలుగుదేశం యూ టర్న్ తీసుకుందనే వార్తకు నిరసనగా ఈ చర్యకు దిగారు. క్రానికల్‌ను మూసేయాలని, చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు.

దాడులు తప్ప మరో మార్గం లేదా?

పత్రికలో వార్తలు వస్తే వివరణ ఇవ్వవచ్చు. ప్రజాస్వామ్య పంధాలో లీగల్ నోటీసు ఇచ్చి కేసులు పెట్టవచ్చు . తప్పుడు వార్త ప్రచురిస్తే అదే చోట వాస్తవం ప్రచురించమని కోరవచ్చు. అలా కాకుండా వందల మందితో పత్రిక కార్యాలయాలకు వెళ్లి దాడులకు దిగడమేమిటో? ఇలా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గతంలో వైసీపీ దాడికి దిగడాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇప్పుడు అరెస్టులు చేస్తుంది. అదే దాడి ఇప్పుడు తెలుగుదేశం చేయడమేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

వైసీపీ కి కూటమికి తేడా లేదా?

కూటమి అధికారంలోకి వచ్చాక ఎచ్చర్లలో యూబీ కంపెనీకి వచ్చే లారీలు తమకు మామూళ్లు ఇవ్వడం లేదంటూ అక్కడి స్థానిక నేతలు ఏకంగా దాడులకు దిగారు. లారీలను రోజుల తరబడి నిలిపివేశారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్ వైసీపీ చేతుల్లోకి వెళ్లడాన్ని నిరసిస్తూ భీమిలి ఎం ఎల్ ఏ గంటా శ్రీనివాసరావు క్లబ్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఆయన అనుచరులు వై ఎస్ ఆర్ పేరిట ఏర్పాటు చేసిన భోర్డును ధ్వంసం చేశారు. యలమంచలి నియోజక వర్గంలో తమతో బేరం కుదుర్చోకోలేదంటూ అక్కడి ప్లాంట్ లకు వచ్చే లారీలను నిలిపివేశారు. తాజాగా విశాఖలో పత్రిక కార్యాలయం పై దాడికి దిగారు. వీటన్నింటినీ చూసిన విశాఖ వాసులు ఇంత భారీ మెజారిటీ మీకు ఇచ్చింది ఇందుకేనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఖండించిన పాత్రికేయ సంఘాలు

విశాఖ లోని పత్రికా కార్యాలయం పై జరిగిన దాడిని ఏపీయూడ్లజే, జాప్ యూనియన్ లు ఖండించాయి. ఇది ప్రజాస్వామ్యం మీద, పత్రిక స్వేచ్చ మీద జరిగిన దాడి అని ఆ సంఘాల నేతలు ఐ వి సుబ్బారావు, చందు జనార్ధన్, ఎండీ వీఆర్ ఎస్ పున్నం రాజు లు ఖండించారు. ఈ దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహించరని, ఇకపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని , ఈ దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.


Similar News