AP:ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం:జిల్లా కలెక్టర్
ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని, వారు ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున, సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ పేర్కొన్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని, వారు ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున, సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ పేర్కొన్నారు. స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం జరిగిన ఒక్క రోజు శిక్షణ సదస్సులో మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి వారిద్దరూ ప్రసంగించారు. పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడ పరిస్థితులను గమనించి నివేదించాలని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి మైక్రో అబ్జర్వర్లు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుందని, దీనిని గుర్తు పెట్టుకొని వారంతా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలులేదని ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను నివేదించడానికి మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగించాలని సూచించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, డీఈవో చంద్రకళ మాట్లాడుతూ పలు అంశాలపై మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పించారు.