తిరుమల లడ్డూ పవిత్రతను గత ప్రభుత్వం దెబ్బతీసింది: MP Sri Bharat
తిరుమల లడ్డూల నాణ్యతపై తీవ్రమైన ఆరోపణలు దారుణమైన వని విశాఖపట్నం ఎంపి శ్రీభరత్ ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:తిరుమల లడ్డూల నాణ్యతపై తీవ్రమైన ఆరోపణలు దారుణమైన వని విశాఖపట్నం ఎంపి శ్రీభరత్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రత ను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసింది అని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, "నేషనల్ డైరీ రిపోర్ట్ ఆధారంగా ఐదు వేర్వేరు పరీక్షలు చేయగా, లడ్డూల్లో స్వచ్ఛమైన నెయ్యి కాకుండా పామాయిల్ మరియు ఇతర నూనెలు వాడినట్లు తేలింది. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసే విషయం" అని శ్రీభరత్ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఓ సంస్థ ద్వారా లడ్డూల తయారీకి అవసరమైన నెయ్యి సరఫరా చేయడాన్ని అడ్డుకోవడం ఈ పరిస్థితికి దారితీసిందని ఆయన ఆరోపించారు. " వైసీపీ ప్రభుత్వం పెద్దలు దీనిపై సమాధానం చెప్పాలి. ఇది చాలా దురదృష్టకర పరిణామం. సీబీఐ విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయి" అని ఆయన చెప్పారు.
ప్రభుత్వ మార్పు అనంతరం ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం తప్పులు చేయడమే కాదు, ఆ తప్పులను దాచిపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయని విమర్శించారు. "తిరుపతి తరహా ఘటనలతో మిగిలిన ఆలయాల్లో కూడా పరిక్షలు జరపాల్సిన పరిస్థితి ఉంది" అని శ్రీభరత్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.