AP News:ఊపిరి తీస్తున్న ఫార్మా కంపెనీలు..ఆ కంపెనీ అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లదే!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపుం ఎస్‌ఈజడ్‌లో 18 మందిని పొట్టన పెట్టుకొన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీ అమెరికాలోని తెలుగు వాళ్లది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:అనకాపల్లి జిల్లా అచ్యుతాపుం ఎస్‌ఈజడ్‌లో 18 మందిని పొట్టన పెట్టుకొన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీ అమెరికాలోని తెలుగు వాళ్లది. ఈ ఘోరమే అమెరికాలో జరిగి ఉంటే అక్కడి చట్టాల ప్రకారం నష్టపరిహారం వేల కోట్లలో ఉండేది. అమెరికా, యూరప్‌లలో సేఫ్టీ ఆడిట్‌లు చాలా కఠినంగా ఉంటున్న కారణంగా ఇటువంటి పరిశ్రమలను భారత్‌లో పెడుతున్నారు. ఇక్కడ ఆ కంపెనీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పరిహారాన్ని, కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించాయి.
ఊపిరి తీస్తున్న ఫార్మా కంపెనీలు..
ప్రజలకు ఊపిరి నింపాల్సిన ఫార్మా కంపెనీలు అందులో పనిచేసే ఉద్యోగుల ఊపిరి తీస్తున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాల తయారీలో నిర్లక్ష్యం, ప్రమాణాలను పాటించకపోవడం వంటివి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. 18 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఫార్మా కంపెనీ మూలాలు అమెరికాలోనే ఉన్నాయి. దీన్ని పెట్టింది అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు కావడం గమనార్హం. అమెరికాలో ఓ కంపెనీ పెట్టాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వీరు విశాఖపట్నం సెజ్‌లో ఇంత హడావిడిగా అరకొర జాగ్రత్తలతో కంపెనీ పెట్టేసి, నడిపిస్తూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటువంటి ప్రమాదమే అమెరికాలో జరిగి ఉంటే ఉన్న ఆస్తులు అమ్మిన బయటపడకపోగా మరికొన్నేళ్లు జైళ్లలో గడపాల్సి వచ్చేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కంపెనీ కథ ఇదీ..
ఈ కంపెనీ డైరెక్టర్లు సోషల్ మీడియాలో పెట్టిన వివరాల ప్రకారం ఎసెన్షియల్ ఫార్మా, బయోటెక్ కంపెనీ 2007లో అమెరికాలోనే ప్రారంభమైంది. ఆధునిక సైన్స్, ఇంజనీరింగ్ ల సాయంతో ఔషధాల తయారీలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా మందులు తయారు చేస్తోంది. ప్రాసెసింగ్ లో మంచి పేరుండడం, ఫార్మాస్యూటికల్ తయారీలో అనుభవం కంపెనీకి ఉన్నాయి. మందుల్ని తయారు చేయడంతో పాటు పంపిణీ చేసే కట్టుదిట్టమైన వ్యవస్థలు ఈ కంపెనీకి ఉన్నాయి. అమెరికన్ టెక్నాలజీ ఆధారిత భాగస్వామి. ఆ టెక్నాలజీ సాయంతోనే ఔషధాలు తయారు చేస్తోంది. డాక్టర్ యాదగిరి రెడ్డి పెండ్రి తన కుటుంబ సభ్యుడైన మరో వ్యక్తితో కలిసి ఈ కంపెనీని ఏర్పాటు చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 15 ఏళ్లుగా కంపెనీని విస్తరించింది. సరికొత్త ఔషధాల తయారీ రంగంలో భాగస్వామిగా ఉన్నారు. కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గా కిరణ్ రెడ్డి పెండ్రి ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు కోరాడ సీఎఫ్ఓగా ఉన్నారు.
ప్రధాన కార్యాలయం అమెరికాలోని కనెక్టికట్‌లో..
ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కనెక్టికట్ స్టేట్ సౌత్ విండ్సర్ లో ఎసెన్షియా గ్లోబల్ ఆఫీస్, పరిశోధన, ప్రయోగశాలలు ఉన్నాయి. దీని బ్రాంచీలు హైదరాబాద్, విశాఖపట్నం (అచ్యుతాపురం సెజ్)లో ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు, తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఔషధ తయారీ యూనిట్ అత్యంత ఆధునికమైందని చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీలో నూతన ఆవిష్కర్తలు ఇక్కడ చేస్తుంటారని చెబుతున్నారు. మనుషుల జీన్స్ ను బట్టి మందులు (వ్యక్తిగత జెనోమిక్స్) వంటి 21వ శతాబ్దపు రోగాలకు మందులు ఈ సంస్థ తయారు చేస్తుంది.
పెట్టుబడి ఎంతంటే?
ఈ కంపెనీ అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో సుమారు 22 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరో 22 కోట్ల రూపాయల షేర్లు అమ్మి మొత్తం 42 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సెజ్‌లో నామమాత్రపు ధరకి 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఈవేళ దాని మార్కెట్ రేటు దానికి ఐదింతలు అయింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఘనంగా చెప్పుకున్న ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఇటీవలి కాలంలో రెండు స్వల్ప ప్రమాదాలు జరిగాయని, అయితే అవేవీ బయటకు రాలేదని అంటున్నారు. ఇంటర్మీడియట్ కెమికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు (ఏపీఐ) ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ 2019 ఏప్రిల్ లో ప్రారంభమైంది. అందుతున్న సమాచారం ప్రకారం కంపెనీ చిరునామా 250 నట్ మెగ్ రోడ్ సౌత్, సౌత్ విండ్సర్, కనెక్టికట్-06074-3499, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వుంది. మందులు పంపిణీ చేసే కార్పొరేట్ ఆఫీస్- కెండల్ స్క్వేర్, కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. హైదరాబాద్ జినోమ్ వ్యాలీ ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో రీసెర్చ్ స్టేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ లాబ్స్ ఉన్నాయి.