అంతా వాళ్లే చేశారు.. వైసీపీ లీగల్ సెల్‌పై నారా లోకేశ్ ఆగ్రహం

వైసీపీ లీగల్ సెల్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2023-12-17 13:06 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ లీగల్ సెల్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ లీగల్ సెల్‌ కోర్టుకు వెళ్లడం వల్ల జీవో 229 అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలులో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పంచగ్రామాల ప్రజలకు ఆయన కీలక హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల సమస్యలన్నీ తీర్చేస్తామని చెప్పారు. జీవో 229 అమలు సమస్యలు అవుతాయని తెలిపారు. ఆ జీవో అమలు కాకుండా వైసీపీ లీగల్ సెల్ కోర్టుకు వెళ్లిందని, అందువల్లే పంచగ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు టీడీపీ హయాంలో తీర్చలేకపోయామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అక్కడ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

గతంలోనే జీవో 578ను తీసుకొచ్చి పంచగ్రామాల ప్రజల సమస్యలు తీర్చాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుకున్నారని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తానని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పి.. ఆ తర్వాత సమస్యను జఠిలం చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పంచగ్రామాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారని నారా లోకేశ్ పేర్కొన్నారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చేందుకు హామీ ఇచ్చి ఆ తర్వాత కాలక్షేపం చేశారని తెలిపారు. కనీసం ఇళ్ల సమస్యలను కూడా తీర్చలేకపోయారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పంచగ్రామాల సమస్యలు పరిష్కరించేందుకు జీవో 229ను అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు.

Tags:    

Similar News