Mla Ganta Srinivas: సలహాలివ్వండి.. రాజకీయం చేయొద్దు..!
విశాఖ వైసీపీ నేతలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ (Vishaka Steel Plant) అంశం మరోసారి రాజకీయ మాటల యుద్ధానికి తెరతీసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలపై వైసీపీ నాయకులు (Ycp Leaders) విమర్శలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ (Tdp) నాయకుల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Mla Ganta Srinivasa Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో సలహాలుంటే ఇవ్వాలని రాజకీయం చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ తమకు సెంటిమెంట్ అని, కచ్చితంగా కాపాడుకుంటామని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై బురదజల్లడం వైసీపీ నేతలకు అలవాటైపోయిందని విమర్శించారు. ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ వైఖరి చెప్పాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని గంటా శ్రీనివాసరావు విమర్శించారు.