ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: Atchannaidu
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికి జగన్ పాలనలో అధికార దుర్వినియోగం జరుగుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు..
దిశ, ఉత్తరాంధ్ర: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికి జగన్ పాలనలో అధికార దుర్వినియోగం జరుగుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖ కలక్టరేట్‌లో ఎమ్మెల్సీ అభ్యర్ధి చిరంజీవిరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేపాడ చిరంజీవి రావు సుపరిచితుడన్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధిగా చిరంజీవి రావు ప్రజాసేవకు అర్హులన్నారు. మూడు జిల్లాల్లో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు చేయించారని ఆరోపించారు. వాలంటీర్లను వెలుగు ఉద్యోగస్తులను ఉపయోగించుకున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా టీడీపీ అభ్యర్ధిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్ధ గాడి తప్పిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరినీ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి మాట్లాడుతూ నోటిఫికేషన్లు లేవని, టీచర్లు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి రావడం ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.