Visakha: సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన నిర్మాత సి. కల్యాణ్
సినిమా విడుదలైన First Day First Showఫస్ట్ డేనే ఫైబర్ నెట్ ద్వారా ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే..
దిశ,డైనమిక్ బ్యూరో: సినిమా విడుదలైన ఫస్ట్ డేనే ఫైబర్ నెట్ ద్వారా ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోతారని పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం అద్భుతమని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు సినీ నిర్మాత సి.కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం మారుమూల గ్రామాల్లోని ప్రేక్షకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలకు, థియేటర్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలు బతికేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు విమర్శలు చేయడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేడు విమర్శించిన వారే రేపు ప్రశంసిస్తారని సి.కల్యాణ్ చెప్పారు.
ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం విశాఖలోని పార్క్ హోటల్‌లో ప్రారంభించారు. మంత్రి అమర్నాథ్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమా 'నిరీక్షణ'ను విడుదల చేశారు.