KGH అంటే భయపడేలా చేస్తున్నారు: ప్రియాంక దండి

ఉత్తరాంధ్ర పేద ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ ఆరోగ్య కేంద్రం కేజీహెచ్ ప్రతిష్ట భ్రష్ఠు పడుతోందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ఆవేదన వ్యక్తం చేశారు. ..

Update: 2023-02-17 16:13 GMT

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్ర పేద ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ సూపర్ స్పెషలిటీ ఆరోగ్య కేంద్రం కేజీహెచ్ ప్రతిష్ట భ్రష్ఠు పడుతోందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఆరోపణలు వచ్చినపుడు కంటి తుడుపు చర్యగా అధికారులు హడావిడి చేస్తారని, తరువాత షరా మాములే అని ప్రియాంక ఆరోపించారు.


ఆసుపత్రిలో ఇచ్చే మందులు కూడా నాణ్యతగా లేవని, ఇక్కడ వాడుతున్న మందుల్లో సున్నం ఉంటోందని, ఆసుపత్రికి చెందిన సిబ్బందే తన దృష్టికి తీసుకువచ్చారని, అది ఎంతవరకు నిజమో వెంటనే పరీక్షించి చూడాలని ప్రియాంక దండి డిమాండ్ చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లలేక కేజీహెచ్‌నే నమ్ముకున్న వారి సంఖ్య ఉత్తరాంధ్రలో లక్షల్లో ఉందన్నారు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చిన రోగులను ప్రతి దానికి సిబ్బంది డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా అధికారులకు ప్రజల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. అత్యంత ప్రతిష్ట ఉన్న కేజీహెచ్‌పై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనబడుతూనే ఉందన్నారు.

కేజీహెచ్ రోగుల బాధ చూడలేక ఇటీవల రూ. 10 లక్షలతో ప్రజావసరాలను ఏర్పాటు చేశామని ప్రియింక దండి తెలిపారు. అయితే దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఇక్కడ ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ని కలిసి ఆసుపత్రిలో ఒక హెల్ప్ లైన్, రోగుల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించేలా స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని ప్రియాంక పేర్కొన్నారు.

Tags:    

Similar News