విశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్లు..పీతల మూర్తి సంచలన వ్యాఖ్యలు
నిత్యం దైవ నామస్మరణలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: నిత్యం దైవ నామస్మరణలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హిందువులు వ్యతిరేకించకుండా ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి పదేపదే ఆలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఋషికొండ విధ్వంసకుడు, వ్యాపారి ఆయనే..
బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి వేల లారీల గ్రావెల్‌తో వందల కోట్లు సంపాదించారని, ఋషికొండను తవ్వగా వచ్చిన రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సీఆర్‌జెడ్ ప్రాంతంలో డంపు చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారని అన్నారు. గంగవరం పోర్టు అధినేత ముఖ్యమంత్రి జగన్ కి సన్నిహితులు కావడం, స్వయంగా కారు చౌకగా పోర్ట్ లోని విక్రయించడానికి చెవిరెడ్డి సొమ్ము చేసుకొని మట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారని, ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి అమ్ముకున్నారని ఆరోపించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో ఆదాని నిర్మిస్తున్న బెర్త్ లు అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని అన్నారు.
పెందుర్తి గుర్రంపాలెం లో భారీ స్కాం..
‘‘తనకు ఏమాత్రం సంబంధం లేని పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం లో 200 ఎకరాల్లో క్వారీయింగ్ చేసి వందల కోట్లు సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉండగా ఈ భూములకు ‘నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్’ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి సొమ్ము చేసుకున్నారు.’’ అని ధ్వజమెత్తారు.
ఫార్మాసిటీలో డంపులు..
‘‘పరవాడ లోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టి రసాయన వ్యర్థాలు డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జి పనిచేసిన రాజ్యసభ సభ్యుడు పి. విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఫార్మా సిటీ లో తరచూ ప్రమాదాలు జరిగినా అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు’’ అని ఆరోపించారు.
చెవిరెడ్డి బాటలో ఇంకెందరో..?
తిరుపతి జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి విశాఖకు వచ్చి ఐదేళ్లలో 1000 కోట్లకు పైగా వ్యాపారం చేశారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో దోపిడీ ఎంతగా సాగిందో అర్థం చేసుకోవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ దోపిడీ బృందం ఆస్తులను దోచుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేసింది. వీటన్నిటి పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని, రానున్న కూటమి ప్రభుత్వం వీటన్నింటి పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి వి స్ న్ రాజు,ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయ కర్త నాగలక్ష్మి చౌదరి,టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతన్నరెడ్డి,వార్డు అధ్యక్షుడు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.