AP:దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలేవీ..బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ, అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పిలుపునిచ్చారు.

Update: 2024-08-07 14:26 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ, అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పిలుపునిచ్చారు. ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చ ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణ లో భాగంగానే రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలేవీ..

గత ఐదేళ్లలో జాతీయ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 750 మంది దళితుల మీద దాడులు జరిగితే చర్యలు లేవు అని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో గవర్నర్ కి ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. దీంతో కమిషన్ స్పందించి ఈ వ్యవహారం మీద ప్రభుత్వాన్ని నివేదిక కోరిందని చెప్పారు. ఈ దాడులు మీద హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. అప్పటి అధికారులు మీద చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 21 ఎస్సీ కార్పొరేషన్ పథకాలు రద్దు చేయడం వల్ల దళితులు తీవ్రంగా నష్టపోయారని అవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ మోర్చా అఖిల భారత కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ మోర్చా పటిష్టం అయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర నిధులు ఖర్చు చేయలేదని మండి పడ్డారు. కేంద్ర బడ్జెట్ లో సామాజిక న్యాయం కోసం పెద్ద పీట వేశారని, విద్యార్థుల్లో దేశభక్తి పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఎస్సీ మోర్చ విశాఖ జిల్లా అధ్యక్షుడు గని రెడ్డి రాకేష్ చంద్ర మాట్లాడుతూ, జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాలి అని కోరారు.

బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మెదపాటి రవీంద్ర, పార్వతి పురం ఇంఛార్జి ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి ,బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కోడూరి సంజీవ్ రావు, కణితి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చార్లెస్ మాధవి లత, ఉపాధ్యక్షులు మౌళి, రాష్ట్ర కో కన్వీనర్ శివ, పార్వతి పురం ఇంఛార్జి కల్యాణి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్, అధిక సంఖ్యలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News