పీకల్లోతు కష్టాల్లో వైసీపీ.. మౌనంగా రాజగురువు

పీకల్లోతు కష్టాల్లో వైసీపీని రాజగురువు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి...

Update: 2024-09-28 02:14 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ రాష్ట్రాన్ని ఏలిన ఐదేళ్ల కాలంలో ఆయన రాజగురువు. ఒక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే కాదు పలు ప్రభుత్వ శాఖల్లో పైరవీలకు కేరాఫ్ అడ్రస్ ఆ స్వామి. ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసింది శాసనం. చివరకు మంత్రులకు దీటుగా ప్రోటోకాల్‌ను సైతం ఎంజాయ్ చేసిన స్వరూపానందేంద్ర ఇప్పుడు మాయమైపోయారు. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో వైసీపీ నేతలు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తన మద్దతుదారులైన స్వామీజీలతో వైసీపీకి అండగా నిలబడాల్సిన స్వరూపానందేంద్ర ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అదే ఇప్పుడు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

దీక్షలో ఉంటే మాట్లాడరా?

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భజన చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడిన స్వరూపానందేంద్ర ఆ తరువాత చాతుర్మాస దీక్ష పేరిట ఋషికేశ్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన వివాదాల్లో ఏ రోజు జోక్యం చేసుకోలేదు. తన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. తన అభిప్రాయం చెబితే ఏమవుతుందో అన్న భయంతో నోరు మెదపడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి. గతంలో ఋషికేసులో ఉన్నప్పటికీ పలు పర్యాయాలు అయిన పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. వైసీపీ పాలనా కాలంలో టీటీడీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులను ఏకంగా రుషికేశ్ రప్పించుకున్నారు.

గతం కంటే భిన్నంగా మౌనం

వైదిక వ్యవహారాలపై పెద్దగా పట్టు లేని విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర కాస్తో కూస్తో పాపులర్ అయింది హైందవ ధర్మంపై, ఆలయాలపై జరిగిన దాడులను నిర్భయంగా ఖండించడం ద్వారానే. మిగిలిన స్వాములు చాలా విషయాలలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరు. హైందవ ధర్మంపై సనాతనంపై దాడులు జరుగుతున్నా నోరు విప్పరు. అటువంటి పరిస్థితులలో స్వరూపానందేంద్ర గట్టిగా గళం విప్పి మీడియా ముందుకు వచ్చి మరీ తన అభిప్రాయాలను వెల్లడించేవారు. ఇప్పుడు ఆయన కూడా మౌనాన్ని ఆశ్రయించారు.

అడకత్తెరలో పోక చెక్క ..

తనకు వందల కోట్ల భూములు, ఆస్తులను కూడపెట్టిన వైసీపీకి మద్దతుగా స్వరూపానంద నిలబడతారని ఆ పార్టీ నేతలు ఆశించారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం స్వరూపానందేంద్రకు, ఆయన ఆశ్రమానికి ఎంతో మేలు చేసి పెట్టింది. దానికి కృతజ్ఞతగా తిరుమల లడ్డూల విభాగంలో వైసీపీ ప్రభుత్వం తప్పేమీ లేదని స్వరూపానందేంద్ర చెబుతారని ఆశించారు. అయితే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు ఆయన నోరు విప్పకుండా పలాయన వాదాన్ని అందుకున్నారు.

వైసీపీ నేతల ఆగ్రహం ..

తాము ఎంతగా చెప్పినా వినకుండా ఎటువంటి అర్హతలు చరిత్ర లేని, శారదా పీఠాన్ని స్వరూపానందను నెత్తిన పెట్టుకొని మోసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి జరిగిందని వైసీపీ నేతలు ఇప్పుడు గొణుక్కుంటున్నారు. దేవాదాయ శాఖ‌తో పాటు ప్రభుత్వంలోని పలు విభాగాలను పూర్తిగా స్వరూపానందకు అప్పగించడం ద్వారా జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారని మండిపడుతున్నారు. స్వరూపానందను నెత్తిన పెట్టుకున్న కారణంగా న్యూట్రల్‌గా ఉండే స్వామీజీలు, హైందవ పెద్దలు వైసీపీకి అనుకూలంగా మాట్లాడటానికి ముందుకు రావడం లేదని వాపోతున్నారు.


Similar News