Minister Amarnath: అప్పుడు పార్ట్-1.. ఇప్పుడు పార్ట్-2.. పవన్ యాత్రపై సెటైర్స్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండో విడత వారాహి విజయయాత్ర మరికాసేపట్లో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మలివిడత వారాహి విజయయాత్రపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు...

Update: 2023-07-09 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండో విడత వారాహి విజయయాత్ర మరికాసేపట్లో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మలివిడత వారాహి విజయయాత్రపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర చూస్తుంటే అది వెబ్ సిరీస్‌ను తలపిస్తుందంటూ సెటైర్లు వేశారు. అసలు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. ‘మొన్నటి వరకు పార్ట్-1.. ఇప్పుడు పార్ట్-2 విజయ యాత్ర అంట. ఎన్నికలు జరగకముందే విజయ యాత్ర ఏంటో అంటూ విమర్శలు చేశారు. మెుదటి దశ వారాహి విజయయాత్ర వారం రోజులు కూడా జరగకముందే జ్వరం వచ్చేసిందని ప్యాకప్ చెప్పేశాడు.’ అని విమర్శించారు. జ్వరం పేరు చెప్పి మంచాన పడ్డారని విమర్శించారు. మళ్లీ నాలుగు రోజులు రెస్టు తీసుకున్న అనంతరం ఇప్పుడు పార్ట్‌-2 అంటూ బయలుదేరాడని ధ్వజమెత్తారు. రాజకీయమంటే పవన్ కల్యాణ్ దృష్టిలో వెబ్‌సిరీస్‌నా? అని నిలదీశారు. రాజకీయం అంటే ఓటీటీలో వచ్చే వెబ్‌సిరీస్ అనుకున్నారా? అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో అని...రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో అంటూ సెటైర్లు వేశారు.

విశాఖలో ఆదివార మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ను మెగా అభిమానులు, జనసైనికులు రాజకీయాల్లో హీరోని చేయాలని భావిస్తున్నారన్నారు. అయితే పక్క సినిమా హీరో పక్కన నిలుచుంటానని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ పక్కన ఉన్న వ్యక్తి విలన్ అనే విషయం మరిచిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎవరినైతే ఎత్తుకుని తిరుగుదామని ప్రయత్నం చేస్తున్నారో ఆ చంద్రబాబు.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ విలన్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు కోసం పవన్ కల్యాణ్ ఎందుకు అంత తాపత్రయపడుతున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నిలదీశారు.

టీడీపీ,జనసేనలకు అభ్యర్థులు కరువు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాలలో పోటీ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే ప్రజలు స్వాగతిస్తారు కానీ చంద్రబాబును పట్టుకుని, కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదుతామంటే ఎలా? అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నిలదీశారు. చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం ఎందుకని నిలదీశారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలుపొందాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే....అసలు 175 సీట్లలో అభ్యర్థులను ఎలా పెట్టాలా అని చంద్రబాబు, పవన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. అటు టీడీపీకి గానీ ఇటు జనసేనకు గానీ 175 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. పవన్ కల్యాణ్, అటు చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. వైసీపీకి ఈసారి మరిన్ని సీట్లు అధికంగా వస్తాయని ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News