ఏపీని డ్రగ్స్‌కు చిరునామాగా మార్చారు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ..

Update: 2024-03-21 16:59 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు. "ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుంది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలి. గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మూలాలు విజయవాడలోని ఆషి ట్రేడర్స్ పేరు మీద తేలాయి. ఆ సంస్ధ వెనక ఉన్న పెద్దలు గురించి కూడా లోతుగా విచారించాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్ కి రాజధానిగా మార్చింది అని గౌరవ ప్రధాన మంత్రి గారి సమక్షంలోనే బొప్పూడి బహిరంగ సభలో కొద్ది రోజుల కిందటే చెప్పాను. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి ఎంతగా ఉన్నాయో, సరఫరా ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలి. కేంద్ర నిఘా సంస్థలు డ్రగ్స్ రాకెట్ ను చేధించేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడను మరింత లోతుగా చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి." అని గురువారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Similar News