AP News:బీజేపీ టీడీపీకి తోక పార్టీనా? ఐవైఆర్ కృష్ణారావు సెన్సేషనల్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీతో పొత్తు , సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయని ఆ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు.

Update: 2024-04-22 08:33 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీతో పొత్తు , సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయని ఆ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏపీ బీజేపీ మనుగడే ప్రశ్నార్దకమౌతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఏపీలో బీజేపీ దిశ దశ లేకుండా సాగుతోందనడానికి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపిక ఉదాహరణ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలనపై ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, అక్కడే బీజేపీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీట్ల పంపకాల్లో మాత్రం టీడీపీ ఇచ్చినవి-బీజేపీ తీసుకున్నవి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నియోజకవర్గాలేనని ఐవైఆర్ కృష్ణారావు గుర్తు చేశారు. ఆ తీసుకున్న మూడు నాలుగు పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమంలో ముస్లిం మెజారిటీ ప్రాంతం అని గుర్తు చేశారు.

ఏ ప్రాతిపదికన ఈ సీట్లను తెలుగుదేశం పార్టీ బీజేపికి ఇచ్చింది- వాటిని బీజేపీ తీసుకుందో అర్థం కావట్లేదని ఐవైఆర్ అన్నారు. కొంతమంది అభ్యర్థులను ముందే బీజేపీ నిర్ణయించి ఉంటే వాళ్లకు కలిసివచ్చే నియోజకవర్గాలను టీడీపీ వద్ద గట్టిగా అడిగి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా టీడీపీ ఇచ్చిన నియోజకవర్గాల్లో తాము నిర్ణయించిన అభ్యర్థులను సర్దుబాటు చేసే ప్రయత్నానికి పాల్పడటం వల్లే ఈ తంటలు వచ్చిపడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పార్టీలో చేర్చుకుని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం అనేది ఏపీలో బీజేపీ మనుగడనే ప్రశ్నించే చర్యగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కావాలనుకుంటే ఆ సీటును టీడీపీకి వదిలి రాజమండ్రి అర్బన్ తీసుకొని సోము వీర్రాజుతో పోటీ చేయించి ఉండొచ్చని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో బీజేపీ " అలా చేయలేదని అన్నారు. టీడీపీకి ఇబ్బంది పడకుండా బీజేపీ రాజకీయాలు సాగాలనుకోవడం సరికాదని అన్నారు.


Similar News