Janasena, Bjp పొత్తుపై ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత సరైన పాలన లేదని కేంద్రమంత్రి మురళీధరన్ భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అన్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ..

Update: 2023-01-28 11:49 GMT

దిశ, ఉత్తరాంధ్ర: ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత సరైన పాలన లేదని కేంద్రమంత్రి మురళీధరన్ భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో అన్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. విశాఖ బీజెపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిదిన్నరేళ్లలో కుటుంబ, వారసత్వ పాలనతో అభివృద్ధి కుదేలైందన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ బీజేపీ కలయికతో రావాలని జీవీఎల్ ఆకాంక్షించారు. 'వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. అది టిడిపి కాదు. భ్రమలు వద్దు. మేమూ జనసేనా కలిసే ఉన్నాం. ఆ విషయం మేమూ, జనసేన చెపుతుంటే కాదని కొందరు ప్రచారం చేయటం ఏమిటి?.' అని జీవీఎల్ ప్రశ్నించారు

వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాజకీయాన్ని, పాలనను ప్రాంతీయ పార్టీలు కుటుంబమయం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వారసత్వాల మీదే తమ పోరు అని జీవీఎల్ పేర్కొన్నారు. 'ఈ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక వైఖరి పెరిగింది. తిరుమల దేవుడినుంచి భక్తులను దూరం చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ తప్ప ఎవరూ గొంతెత్తటం లేదు. వచ్చే మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పనుల గురించి నేను నా స్థాయిలో ప్రయత్నిస్తాను. అరకు రోడ్డు అభివృద్ధి గురించి నితిన్ గడ్కరీని అడుగుతా. స్టీల్ ప్లాంటు సమస్యలు, ఉత్తరాంధ్రలో ఈబీసీ రిజర్వేషన్లు, మత్స్యకారుల సమస్యలు ప్రస్తావిస్తా.‌ అన్ని పెండింగ్ పనులూ పూర్తయేలా కృషి చేస్తా.' అని జీవీఎల్ పేర్కొన్నారు.

రానున్న రెండు నెలల్లో రాష్ట్ర సమస్యలు, విశాఖ సమస్యలన్నీ కేంద్రం దృష్టికి తీసుకు వెళతానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వందేభారత్ విశాఖకు రావటం వరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని వందెభారత్ రైళ్లు వస్తాయని తెలిపారు. విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగుళూరుకు ఒక వందేభారత్ కావాలని అడుగుతున్నామని తెలిపారు. 'పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలను ఎవరికి అనుకూలంగా వారు అర్ధాలు తీసుకుంటున్నారు. బీజేపీతో కలిసి ఉన్నామని పవన్ చెబుతున్నారు.' అని జీవీఎల్ తెలిపారు.

Tags:    

Similar News