AP:వాగులు పొంగితే రాకపోకలు బంద్..వంతెన నిర్మాణం ఎప్పుడో!?

అక్కడ అనారోగ్యంతో మంచం పట్టి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిందే.

Update: 2024-07-28 12:04 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:అక్కడ అనారోగ్యంతో మంచం పట్టి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిందే. అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయితీ పరిధిలో 10 గ్రామాలు, ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామంలో నివాసముంటున్న గిరిజనుల దుస్థితి ఇది. ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజి వాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి దాటాల్సిస్తుంది. వైద్యం, సరుకులు ఏం కావాలన్నా వీరు ప్రాణాలు అరచేత పట్టుకొని ఈ వాగు దాటాల్సిందే.

వాగుపై వంతెన లేకపోవడంతో తాజాగా సత్యారావు అనే కాళ్లు చేతులు పని చేయని గిరిజనుడిని, అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించేందుకు వంట పాత్ర సహాయంతో వాగు దాటించాడు. పెద్ద వంట పాత్రాల్లో వారిని కూర్చోబెట్టి వాటిని తలపై పెట్టుకొని దాటాల్సి వస్తుంది. వంతెన నిర్మిస్తామంటున్న నేతల మాటలు నీటి మూటలే అవుతున్నాయని ఈ గ్రామాల గిరిజనులు ఆరోపిస్తున్నారు. కనీసం ఇటువంటి పరిస్థితుల్లో పడవలు, తెప్పలు వంటివి ఏర్పాటు చేయాలని స్రుహ కూడా ఐ టీ డీ ఏ అధికారులకు లేకుండా పోయింది. ఇప్పటికైనా పాలక పెద్దలు, ప్రభుత్వ అధికారులు స్పందించి, వంతెన నిర్మించి ప్రజలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Similar News