AP:చంద్రబాబును సీఎంగా గుర్తించం..ప్రభుత్వం మారిన అధికారుల తీరు మారలే..!

రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేయించుకున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Update: 2024-06-27 02:11 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేయించుకున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కారణంగానే సీఎంగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులైన తర్వాత కూడా గుర్తించలేకపోతున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఫొటోను బుధవారం వరకూ వీసీ ఛాంబర్‌లో పెట్టలేదు.

నాడు జగన్ లేకుండా ఫొటో లేదు..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వీసీ ఛాంబర్‌లో జగన్ ఫొటో ప్రముఖంగా కనిపించేది. పీహెచ్‌డీ పొందిన వారు, అతిథులు వచ్చి ఫోటో దిగాలనుకొంటే సీఎం జగన్ ఫోటో కనిపించేలా నిలబడి, నిలబెట్టి పోజులు ఇచ్చేవారు. ఫ్రేమ్‌లో జగన్ ఫోటో లేకుండా ఎవరితోనూ ఫోటో దిగని వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల ఫోటోలను వీసీ ఛాంబర్లో పెట్టడానికే ఇష్ట పడటం లేదు. అయితే, జగన్ ఓడిపోయినందుకు ఆయన ఫొటోను తన ఛాంబర్‌లో తీసేశారు. దాని స్థానంలో పెట్టాల్సిన చంద్రబాబు ఫొటో మాత్రం ఇంతవరకు పెట్టలేదు. బుధవారం ఏయూ మీడియా సెల్ విడుదల చేసిన ఫొటోలో ముఖ్యమంత్రి ఫొటో లేకుండానే వీసీ, రిజిస్ట్రార్ ఫ్రేమ్‌లో కనిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 23 రోజులైనా, ఇంకా జగన్ ను మాత్రమే తాను సీఎంగా గుర్తిస్తానన్నట్లుగా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ప్రవర్తిస్తున్నారని అధ్యాపక, అధ్యాపకేతర సంఘాలు మండి పడుతున్నాయి.

పట్టించుకోని కూటమి పక్షాలు..

రాష్ట్రంలోని మిగిలిన విశ్వవిద్యాలయాల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వీసీ, రిజిస్ట్రార్ లకు వ్యతిరేకంగా టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ భజన బ్యాచ్ వీసీ, రిజిస్ట్రార్ లు రాజీనామాలు చేయాలని వారి వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. అయితే, విశాఖ ఏయూలో మాత్రం తెలుగుదేశం నేతలు చాలా జాగ్రత్తగా క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా బయట ఉన్న ఏయూ చిహ్నానికి పసుపు కుంకుమ రాసి దానినే నిరసన అనుకోమని,పది రోజులుగా ఎస్సీ సంఘాల వారు క్యాంపస్‌లో దీక్షలు చేస్తున్నా కూటమి పక్షాలు పట్టించుకోకపోవడం, స్పందించకపోవడం దారుణమని ఏయూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Similar News