“దొప్పెర్ల’’లో మురుగు మయం.. కాలువల కొరతతో రోగాల భయం!
అచ్యుతాపురం మండలం, దొప్పెర్ల గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

దిశ, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం, దొప్పెర్ల గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన కొల్లి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ, గత 15 సంవత్సరాలుగా గ్రామంలో మురుగు నీరు పారే సౌకర్యం లేక ప్రజలు అనేక వ్యాధులతో బాధ పడుతున్నారని చెప్పారు.
గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, మురుగు నీరు పారే వ్యవస్థ లేకపోవడం వల్ల, ఇళ్ల వద్దనే నీరు నిల్వ ఉండి డెంగ్యూ, మలేరియా, కలరా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత కోసం, మురుగు కాలువల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరుతూ నాగేశ్వరరావు, కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆశిస్తున్నారు.