దిశ, గాజువాక: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు కణితి -- వడ్లపూడి కాలనీలో నూతనంగా నిర్మించిన డా. వై.ఎస్.అర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి విడుదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య , ఆరోగ్య సేవలకు పెద్ద పీట వేసిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉందన్నారు .ఇంత వరకు ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలను వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. మల్లిఖార్జున , జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి , గాజువాక శాసన సభ్యులు తిప్ప ల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.