కుప్పకూలిన నియంత సామ్రాజ్యం..ఏయూలో దీపావళిని తలపించేలా సంబురాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నియంతల మాదిరిగా ఏలిన వైశ్యాసుల ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్ రాజీనామాలతో సంబరాలు మిన్నంటాయి.

Update: 2024-06-28 15:21 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నియంతల మాదిరిగా ఏలిన వైశ్యాసుల ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్ రాజీనామాలతో సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ నిబంధనలకు పాతర వేసి, గత ప్రభుత్వంలో వైసిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయ్ సాయి రెడ్డి అండదండలు విశ్వవిద్యాలయంలో మందుపాతరలు గా మార్చి, ఎయు లో నిరంకుశ పాలన సాగించిన ఓ నియంత సామ్రాజ్యం కుప్పకూలిందన్నట్లుగా సంబరాలు మిన్నుముట్టాయి. ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద సిబ్బంది టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. రిటైర్ అయ్యాక కూడా రిజిస్ట్రార్ గా మూడు సంవత్సరాలు పని చేసి అడ్డగోలు పనులలో సింహభాగం ఆచార్య వడ్డాది కృష్ణమోహన్ కు దక్కుతుందని పరిరక్షణ సమితి నాయకులు అంటున్నారు.

భజన బృందం ఇదే..

పాలక మండలి సభ్యులు మేకా జేమ్స్ స్టీఫెన్, ఆచార్య టి శోభశ్రీ,, ఆచార్య కృష్ణ మంజరి పవార్, ప్రిన్సిపల్స్ కె శ్రీనివాస రావు, రాజేంద్ర కర్మాకర్, రాజేంద్ర ప్రసాద్, శశిభూషణ్ రావు, విజయలక్ష్మి పి శ్రీనివాస రావు, అకడమిక్ అఫైర్స్ డీన్, పరీక్షల డీన్, కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్, యూ జీ సి డీన్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ , యూనివర్సిటీ ఇంజనీర్ ల పాత్ర పై ఆరా తీస్తున్నారు.

ఖాన్ ఆగడాలకు అంతే లేదు

రిటైర్డ్ పోలీసు అధికారి ఖాన్‌ను సెక్యూరిటీ అధికారి గా నియమించి, విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, సిబ్బంది పై జులుము ప్రదర్శించడం ద్వారా ఎవరిని నోరు విప్పనివ్వకుండా చేశారు. ప్రభుత్వానికి చెందిన ఫైనాన్స్ అధికారిని తమ మాట వినేలా చేశారు కృష్ణమోహన్ రిటైర్ అయ్యాక మూడు సంవత్సరాలు రిజిస్ట్రార్ గా కొనసాగించి, తన తప్పుడు పనులకు ఉపయోగించారు. అయితే కృష్ణమోహన్ ను ఓఎస్‌డిగా పరిమితం చెసి, పక్కనబెట్టి, తన బినామీ జేమ్స్ స్టీఫెన్ ను రిజిస్టర్ చేశారని దళిత సంఘాలు అంటున్నాయి. దీనిపై మండిపడ్డ కృష్ణమోహన్ ప్రసాద రెడ్డి పై కారాలు మిరియాలు నూరాడు.

అడుగడుగునా అక్రమాలే

ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి కాలంలో జరిగిన రిక్రూట్మెంట్ ద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చేరిన వ్యక్తి మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగానికి అధిపతి అయిన ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా పదవి చేపట్టిన వెంటనే, కులం కార్డు ద్వారా మొదట రిజిస్ట్రార్ కి, ఆ తర్వాత ప్రసాద్ రెడ్డికి విశ్వాసం పాత్రునిగా మారారు. గత సంవత్సరం టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కు విడుదల చేసిన నోటిఫికేషన్ లో అవకతవకలకు తెరతీశారు.

సైన్స్ కళాశాల కు చెందిన ఈ విభాగంలో ఒక పోస్ట్ స్టాటిస్టిక్స్ అభ్యర్థికి, మరో పోస్ట్ ఎకనామిక్స్ అభ్యర్థికి కేటాయించారు. ఓ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి మేనకోడలు కోసం ఎకనామిక్స్, మరొ ఉన్నతాధికారి బంధువు కోసం స్టాటిస్టిక్స్ పోస్ట్ ఈయన సృష్టించారు. విభాగంలో ఇతర అధ్యాపకులు అభ్యంతరం చెప్పినా ఉన్నతాధికారుల ఆదేశాలు అంటూ విభాగాధిపతి తన పని కానిచ్చేశాడు.

సైన్స్ విభాగంలో ఆర్ట్స్ పోస్టులు

సైన్స్ విభాగంలో ఆర్ట్ విభాగం పోస్ట్ లు పెట్టడం ప్రపంచంలో ఎనిమిదో వింతే. ఇదే విభాగాధిపతి జూవాలజీ విభాగానికి ఇంచార్జి కూడా. ఇక్కడ కూడా ప్రసాద్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన మరో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భార్యకు అనుకూలంగా ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హతలు రూపొందించారు. అసలు ఇప్పుడు మనుగడ లో లేని స్పెషలైజేషన్‌ను ఈ ఉద్యోగాలకు అర్హతగా నిబంధన పెట్టారు. తనను మరో విభాగానికి ఇన్చార్జి విభాగాధిపతిగా నియమించడానికి సహకరించిన వేరే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌కి కృతజ్ఞతగా ఈయన ఈ విభాగంలో ఉద్యోగాల భర్తీకి అర్హతలను రూపొందించారు. యూజీసీ నిబంధనలు పాతరేసి విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల బంధువుల కోసం సైన్స్ లో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ పోస్టులు సృష్టించడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రసాద్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి పేరుతో విదేశాల్లో పర్యటించిన జట్టు లో ఇతడికి స్థానం కల్పించడం కొస మెరుపు. అన్నట్టు కృష్ణమోహన్ తర్వాత రిజిస్ట్రార్ పదవి దక్కించుకోవడానికి ఈ విభాగాధిపతి తీవ్రంగా ప్రయత్నించారు.


Similar News