Gangavaram Port: శ్రమ దోపిడీపై ఆగ్రహం.. వేతనాలు పెంచాలని డిమాండ్
అదాని గంగవరం పోర్టు కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని వివిధ రాజకీయ పక్షాలైన సిపిఐ, సిపిఎం, వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు డిమాండ్ చేశాయి..
దిశ, గాజువాక: అదాని గంగవరం పోర్టు కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని వివిధ రాజకీయ పక్షాలైన సిపిఐ, సిపిఎం, వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు డిమాండ్ చేశాయి. పెద గంట్యాడ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు. ఏఐటియూసి జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ మాట్లాడుతూ గంగవరం పోర్టు కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గంగవరం పోర్టు యాజమాన్యం పాల్పడుతుందని విమర్శించారు. జీతాలు పెంచాలని కార్మికులు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అదాని గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోవడమే కాకుండా కక్ష సాధింపు చర్యలకు పూను కుంటుందని మండిపడ్డారు. పోర్టు కార్మికులకు న్యాయమైన వేతనాలు చెల్లించడంలో పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు.
సీపీఐ గాజువాక నియోజక వర్గం కార్యదర్శి కసి రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం సరైంది కాదన్నారు. 15 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పోర్టు కార్మికులు జీవనాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ గాజువాక ఇంఛార్జి తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ గంగవరం పోర్టు కార్మికుల వేతన సమస్యపై విశాఖ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా చర్చలు జరిగాయని, అయితే గంగవరం పోర్టు యాజమాన్యం మొండి వైఖరి వల్ల వేతనాలు సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. తక్షణమే పోర్టు కార్మికులు వేతనాలు పెంచాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు