CM Jagan: రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడులకు నేనే హామీ

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సును విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు...

Update: 2023-03-04 10:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సును విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. కీలకసమయంలో అందరి సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సును ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.‘ మీ వ్యాపారాలకు, పెట్టుబడులకు నేను హామీ. పరిశ్రమ మీది.. ప్రోత్సాహం మాది. దేశంలోనే సుస్థిర ప్రగతిని సాధించే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అంటూ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

రూ.13లక్షల 5వేల 663 కోట్ల ఒప్పందాలు

‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కరోనా వైరస్ కష్టాలను సైతం అధిగమించాం. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి. ఇప్పుడు కీలక సమయంలో జీఐఎస్‌ నిర్వహించాం. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్-2023 ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈ 15 సెక్టార్లే అత్యంత కీలకమని భావించి ఈ సమ్మిట్ ఏర్పాటు చేశామని, అయితే ఈ సమ్మిట్ విజయవంతం కావడంతో ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 352 ఎంవోయూలు జరిగాయని...100కు పైగా స్పీకర్లు పాల్గొన్నారని సీఎం తెలిపారు. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్‌ నిర్వహించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నామని.. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సీఎం జగన్ వెల్లడించారు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో రావడం శుభ పరిణామమన్నారు. గ్రీన్‌ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకమని చెప్పారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

Tags:    

Similar News