CCLA Judgment: ఆ భూములన్నీ సింహాచలం అప్పన్నవే..
సింహాద్రప్పన్న భూములకు మోక్షం కలిగింది. పరాధీనంలో ఉన్న సుమారు రూ.400 కోట్ల విలువైన భూములు సింహాచలం దేవస్థానానివేనని కోర్టు తేల్చింది..
దిశ, ఉత్తరాంధ్ర: సింహాద్రప్పన్న భూములకు మోక్షం కలిగింది. పరాధీనంలో ఉన్న సుమారు రూ.400 కోట్ల విలువైన భూములు సింహాచలం దేవస్థానానివేనని కోర్టు తేల్చిందిసింహాద్రప్పన్న భూములకు మోక్షం కలిగింది. పరాధీనంలో ఉన్న సుమారు రూ.400 కోట్ల విలువైన భూములు సింహాచలం దేవస్థానానివేనని కోర్టు తేల్చింది. విశాఖ జిల్లా చినగదిలి మండలం, అడవివరం గ్రామం పూర్తి ఈనాం గ్రామం. అక్కడ ఈనాం టైటిల్ డీడ్ నెం.1173 నుంచి 1182 వరకు పత్రాలు కూడా ఉన్నాయి. 1173లో ఉన్న భూములు దేవదాయ ఈనాం భూములే. సింహాచలం దేవస్థానానికి నిత్య ఆరాధన, ధూప దీప నైవేద్యాల కోసమే అవి కేటాయించారు. ఆ తర్వాత ఎస్టేట్ ఎబాలిషన్ యాక్టు ప్రకారం అడవివరం గ్రామం ఈనాం ఎస్టేట్ కాదని, ఎస్టేట్ ఎబాలిషన్ ట్రిబ్యునల్ కూడా తీర్పిచ్చింది. ఇనాం ఎబాలిషన్ యాక్టు సెక్షన్`3 క్రింద విచారణ జరిపి సదరు భూమి దేవస్థానానికి చెందినదేనని 1989లో తీర్పు రావడమే కాకుండా ఆ తీర్పును జిల్లా గెజిట్‌లో కూడా ప్రచురించారు.
సెక్షన్`7 ఈనాం యాక్టు కింద విచారణ జరిపి దేవస్థానానికి 1996లోనే రైత్వారీ పట్టా ఇచ్చారు. టీడీ నంబర్ 1173లో సర్వే నంబర్ 318లో 76.20 సెంట్లు, సర్వే నంబర్ 296లో 18.90 సెంట్ల భూమి ఆలయానికి చెందినదేనని ఆ పట్టా ప్రకారం స్పష్టమైంది. కానీ సర్వే నంబర్ 318పీలో 5.98 సెంట్లు, సర్వే నంబర్ 296/ఏలో 6.50 సెంట్లు తనవేనంటూ ఎస్.వి. నరసింహం అనే వ్యక్తి కోర్టులో దావాలు వేసుకున్నారు. సుప్రీం కోర్టు కూడా వారు దేవస్థానం వేసిన సివిల్ అప్పీల్ నంబర్ 1524/2008లో ఫిబ్రవరి 27, 2009న దేవస్థానానికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. నరిసింహం మాత్రం తదితరులు తప్పుడు సాక్ష్యాలతో ఈనాం కోర్టుల్లో వారికి అనుకూలంగా తీర్పులివ్వగా దానిని సవాల్ చేస్తూ సింహాచలం దేవస్థానం వారు.. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు పూర్వాపరాలు, రికార్డులు, కోర్టు తీర్పుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎస్.వి.నరసింహం వివిధ అంశాల్ని దాచిపెట్టి, కోర్టుల్లో మోసపూరితంగా వ్యవహరించారనే అభియోగాలు వచ్చాయి. ఆ భూములతో వారికి ఎలాంటి సంబంధం లేదని, ఆ భూములు పూర్తిగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి చెందినవేననంటూ ఏఐఏసీ నంబర్ 1/96, జూన్ 18, 1996లో వచ్చిన తీర్పులన్నీ సక్రమేనని మళ్లీ స్పష్టమైన తీర్పు వచ్చింది.
ఈ తీర్పుతో భూ ఆక్రమణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాధ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆలయం తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.వి.ఎస్.ప్రసాద్ వర్మ వాదించి స్వామి వారికే భూములు దక్కేలా కృషి చేశారు. ఆయన సమర్థవంతమైన వాదనలతో ఏకీభవించిన సీసీఎల్‌ఏ కోర్టు ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుమారు 400 కోట్ల విలువైన భూములు స్వామి వారికే దక్కినందుకు అన్ని వర్గాలు ఆనందపడుతున్నాయి.