సీఎం జగన్‌ ఇంటికెళ్లే రోజులు వచ్చేశాయి: విష్ణు కుమార్ రాజు

సీఎం జగన్‌కు పదవి పోయే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు విమర్శించారు

Update: 2024-02-01 15:59 GMT

దిశ, విశాఖ ప్రతినిధి: సీఎం జగన్‌కు పదవి పోయే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు విమర్శించారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎంకు లేదని ఆయన తెలిపారు. గురువారం విశాఖలో పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరితో కలిసి విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే మెడకు ఉరితాడు బిగించుకున్నట్లేనని చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదని, మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన జగన్ మాటలు నీటిమూటలయ్యయని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ భీమిలిలో 40 వేల మంది పట్టే స్థలంలో ‘సిద్ధం’ సభ నిర్వహించి నాలుగు లక్షల మంది వచ్చారని డబ్బా కొట్టుకొంటుందని ఎద్దేవా చేశారు. ప్రజా పోరు కార్యక్రమంలో జగన్ చేసిన దుర్మార్గాలను ఎండగడతామని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ.25 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కార్యాలయాలను ప్రారంభించామని చెప్పారు.

Tags:    

Similar News