గ్రామానికి దారి చూపిన దేవత.. ఆదర్శంగా ఆశావర్కర్

ఆ ఊరికి రోడ్డు లేదు. ఆధునిక యుగంలో కూడా ఆస్పత్రికి వెళ్లాలంటే డోలి తప్పనిసరి....

Update: 2023-04-09 15:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆ ఊరికి రోడ్డు లేదు. ఆధునిక యుగంలో కూడా ఆస్పత్రికి వెళ్లాలంటే డోలి తప్పనిసరి. పురుటినొప్పులతో కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే గ్రామస్థులు డోలి కట్టుకుని మూడు కిలోమీటర్లు ప్రయాణించడం తప్పనిసరి. ఒక్కోసారి సీరియస్ అయ్యి పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇవన్నీ కళ్లారా చూసిన స్థానిక ఆశా వర్కర్ తమ గ్రామంలో ఇంకెప్పుడూ ఇలాంటి చావులు రాకూడదని బలంగా నిర్ణయించుకుంది. అంతే తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్మును రోడ్డు కోసం వెచ్చింది. ఆ గ్రామానికి దారి చూపింది. అందర్నీ ఆలోచింపజేస్తున్న ఈ అరుదైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు గ్రామంలో చోటు చేసుకుంది.

ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు పంచాయతీ తోటగోడిపుట్టు గ్రామానికి చెందిన గిరిజన మహిళ లెబ్బ జమ్మూరు లబ్బురు పీహెచ్‌సీ పరిధిలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు. తోటగోడిపుట్టు గ్రామానికి రోడ్డు లేకపోవడంతో తీవ్రంగా మదనపడేది. గ్రామానికి చెందినవారెవరైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల మేర డోలిలో తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో అలా తీసుకెళ్తూ గర్భిణీ స్త్రీలు మార్గమధ్యలోనే ప్రాణాలొదిలారు. చాలాసార్లు గ్రామస్థులంతా కలిసి ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఇల్లు కట్టుకుందామనుకుని లెబ్బ కొంత సొమ్ము కూడబెట్టుకుంది. అయితే గ్రామస్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడంతో కలతచెంది ఆ సొమ్ముతో రోడ్డు వేయించింది. దీంతో స్థానికులు ఆమెను అభినందించారు.

Tags:    

Similar News