Visakha: భూముల విలువపై సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
తెలుగు రాష్ట్రాల మధ్య భూముల విలువపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంది...
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య భూముల విలువపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంది. తెలంగాణలో భూములు బంగారమయ్యాయని కేసీఆర్ అంటే తమ ప్రాంతంలో కూడా భూములు బంగారం అయ్యాయని ఏపీ ఐటీ మినిస్టర్ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందన్న విమర్శలకు మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఏపీలోని విశాఖపట్నం అచ్చుతాపురంలో ఎకరా స్థలం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని కానీ తెలంగాణలో హైదరాబాద్ మినహా మరే ప్రాంతం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో లేని భూమి రేట్లు విశాఖపట్నంలో ఉన్నాయని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. హైదరాబాద్ వంటి ఒక్క నగరాన్ని పట్టుకుని, తెలంగాణ అంతా ఏదో జరిగిపోతోందనే భావనను సృష్టిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో విశాఖలోనే కాదు, విజయవాడలో, నర్సీపట్నంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ భూముల ధరలు భారీగానే ఉన్నాయని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు.ఏపీలో భూముల విలువపై కేసీఆర్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో తమకు తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలను తీసుకుని కేసీఆర్ చెబితే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు.
రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సరైనదని కాదని.. జాగ్రత్తగా మాట్లాడాలని కేసీఆర్‌కు మంత్రి అమర్‌నాథ్ హెచ్చరించారు. ఏపీలో ఒక్కశాతం ఓటు లేని బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఏమీ సాధించలేరని అన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన సభలో ఏపీలోని భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందని...తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని...కానీ ఇప్పుడు తెలంగాణ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.