Koyyuru: రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో యధేచ్చగా గంజాయి సరఫరా జరుగుతోంది. కోట్ల విలువైన సరకును గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా బేఖాతరు చేస్తున్నారు. జిల్లాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కూడా భారీగా గంజాయి తరలించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే పక్కా సమచారంతో కొయ్యూరు పరిధి భూదరాల పంచాయతీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లలో తరలిస్తున్న 279 ప్యాకెట్లలో 850 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పారిపోయారు. రెండు కార్లతో పాటు బైక్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే గంజాయిని ఎక్కడ నుంచి ఎవరికి తరలిస్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గంజాయి తరలింపుపై పోలీసులు సీరియస్ అయ్యారు. జిల్లాలో ఎవరైనా నిషేధిత పదార్థాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయిపై సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.