మత సంస్థల ముసుగులో నడుస్తున్న అనధికార హాస్టళ్ల పై వేటు..!

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల మండలం లో ముగ్గురు గిరిజన చిన్నారుల మరణాలకు కారణమైన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన ట్రస్ట్ ( పాస) ఉదంతంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Update: 2024-08-21 02:26 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల మండలం లో ముగ్గురు గిరిజన చిన్నారుల మరణాలకు కారణమైన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న పరిశుద్ధాత్మ అగ్ని స్తుతి ఆరాధన ట్రస్ట్ ( పాస) ఉదంతంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్రైస్తవ ప్రార్థన సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న పాస వసతి గృహాన్ని ఇప్పటికే సీజ్ చేసిన అధికారులు ఇటువంటివి ఇంకెన్ని ఉన్నాయన్న దానిపై దృష్టి సారించారు. ఆ ఆశ్రమంలో విషాహారం తిన్న పలువురు చిన్నారులు ఇప్పటికీ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అంతేగాక ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరిగింది.

విశాఖ మన్యంలోనే ఎక్కువ..

విశాఖ మన్యంలో గిరిజనుల అమాయకత్వం, పేదరికం వంటివాటిని ఆసరాగా చేసుకొని పలు క్రైస్తవ, ముస్లిం సంస్థలు ఈ తరహా ఆశ్రమాలను, మదర్సాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే, వీటిని సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. అనుమతులతో పాటు ఇటువంటి వాటిల్లో సదుపాయాలు, చిన్నారులకు అందుతున్న ఆహార నాణ్యత వంటివాటిపై కూడా దృష్టి సారిస్తున్నారు.

మతపరమైనవి కావడంతో అధికారులు దూరం..

పలు క్రైస్తవ, ముస్లిం సంస్ధలు ఈ తరహా అనధికార హాస్టళ్లను, మదర్సాలను నిర్వహిస్తుండడంతో ఇప్పటి వరకు అధికారులు కూడా వీటి జోలికి వెళ్లలేదు. తనిఖీలకు వెళ్లినా మత పరమైన రంగు పులిమే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు దూరం దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే ఇప్పుడు ముగ్గురు చిన్నారుల మరణాలకు కారణమైంది. రాష్ర్ట ప్రభుత్వం నుంచి స్పష్టమైన అదేశాలు అందడంతో ఇటు అనకాపల్లి, అటు మన్యం జిల్లాలోని పోలీసు అధికారులు వీటిపై దృష్టి సారించారు. ఇతర ప్రభుత్వ శాఖల సాయంతో మండలాల వారీగా ఇటువంటి వాటిని గుర్తించే పనిలో పడ్డారు. ఇటువంటి హాస్టళ్ల ను గుర్తించి వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

బాలల హక్కుల కమిషన్ సీరియస్..

ఈ దుర్షటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. విశాఖ జిల్లాలోనే కాక రాష్ర్ట వ్యాప్తంగా ఇటువంటి అనధికార హాస్టళ్లను గుర్తించాలని కమిషన్ చైర్మన్ కె. అప్పారావు ఆదేశాలు జారీ చేశారు.


Similar News