AP News:‘ఆదివాసీలు దేశ పౌరులు కారా?’..గిరిజనుల వినూత్న నిరసన

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లవుతున్నా నేటికీ ఆ ఫలాలు తమకు అందలేదంటూ ఆదివాసీలు నిరసనకు దిగారు.

Update: 2024-08-16 12:49 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లవుతున్నా నేటికీ ఆ ఫలాలు తమకు అందలేదంటూ ఆదివాసీలు నిరసనకు దిగారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కళ్యాణ లోవ, అజయ్ పురం గ్రామంలో జెండా ఎగురవేసిన అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి శుక్రవారం వినూత్న రీతిలో అక్కడివారంతా ఆందోళనకు దిగారు. నాన్ షెడ్యూల్ పరిధిలో 8గిరిజన మండలాలు, 263 గ్రామాల్లో 50 వేల మంది ఏజెన్సీని ఆనుకొని కొండ దిగువ భాగంలో జీవిస్తున్నారని, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాలన్నింటినీ ఏజెన్సీ ప్రాంతాలు గానే గుర్తించారని వారంతా పేర్కొన్నారు. నాన్ షెడ్యూల్ పరిధిలో ఉన్న గిరిజనులకు 5వ షెడ్యూల్ ప్రాంతంగా గుర్తింపు అందక పోవడంతో రాజ్యాంగ పొందిన ఫలాలు అందడం లేదని వాపోయారు. కనీస వసతులైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, అంగన్ వాడీ సెంటర్లు వంటివి.

పీవీటీజీ గ్రామాలకు వర్తింపజేయాలని ఈ సందర్భంగా గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజన భూములను పెద్ద ఎత్తున గిరిజనేతరులు ఆక్రమిస్తుంటే నిలువరించాల్సిన రెవిన్యూ అధికారులు వారికే సహకరిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రకటించిన 1950, షెడ్యూల్ ఏరియా ఆర్డర్లో నాన్ షెడ్యూల్ ఏరియా ప్రాంతాలకు చోటు దక్కలేదని, 1976లో పార్లమెంట్ సవరణ తీసుకు వచ్చినా, నేటికీ 48ఏళ్లపుతున్నా ప్రతిపాదనలు పూర్తి కాలేదని గుర్తు చేశారు. గిరిజనుల భూములను రక్షించాలని, భారత రాజ్యాంగాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని, నూతన అటవీ హక్కుల చట్టం రద్దు చేయాలంటూ వారంతా వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు కె.గోవిందరావు, సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు మర్రి ప్రసాద్, పాంగి సూరిబాబు, ఆదివాసీ గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Similar News