మద్యం పాలసీపై కూటమి నేతల్లో హడావిడి
వైసీపీ ఘోర ఓటమికి ప్రధాన కారణాల్లో అస్థవ్యస్థమైన, అవినీతి పరమైన మద్యం విధానం కీలకమైనదని ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : వైసీపీ ఘోర ఓటమికి ప్రధాన కారణాల్లో అస్థవ్యస్థమైన, అవినీతి పరమైన మద్యం విధానం కీలకమైనదని ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా దీనిని గుర్తించి కొత్త మద్యం పాలసీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. విచిత్రంగా అదేమీ పట్టనట్టు విశాఖ కూటమి ప్రతినిధులు మాత్రం మద్యం వ్యాపారమే తమ కామధేనువు, కల్పవృక్షం అని భావిస్తూ ప్రభుత్వం ప్రకటించే పాలసీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఎంత త్వరగా ప్రభుత్వం పాలసీని ప్రకటించి షాపుల కోసం నోటిఫికేషన్ పిలిస్తే వెంటనే వాటినన్నింటినీ చేజిక్కించుకోవాలని హడావిడి చేస్తున్నారు.
అప్పుడే సిండికేట్
మద్యం వ్యాపారం చేస్తూ ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన నేత ఒకరు అప్పుడే రానున్న మద్యం పాలసీని దృష్టిలో ఉంచుకొని సిండికేట్ కట్టేశారు. విశాఖ నగరంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తాను సూచించిన వ్యక్తులు తప్ప బయట వారెవ్వరూ టెండర్లు వేయకూడదని మిగిలిన ప్రజా ప్రతినిధులతో మాట్లాడి చెప్పేశారు. విశాఖలో ఎక్కడెక్కడ ఎవ్వరు ఎవ్వరు వ్యాపారం చేయాలో తానే నిర్ణయిస్తానని, దానికి తగ్గ ప్రతిఫలం సంబంధిత నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు అందేలా ఏర్పాటు చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చినట్లు తెలిసింది.
షాపుల యజమానులతో ఒప్పందాలు కూడా..
వైసీపీ పాలనలో వైన్ షాపులను ప్రభుత్వమే నడిపింది. ఎక్సైజ్ అధికారులే షాపుల యజమానులతో మాట్లాడి అద్దెలను ఖరారు చేశారు. ఈ షాపులను గతంలో మాదిరిగా ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చేయవచ్చన్న అభిప్రాయంతో విశాఖలోని ప్రస్తుత షాపులు ఉన్న భవనాల యజమానులతో సదరు ప్రజా ప్రతినిధి సిండికేట్ సభ్యులు మాట్లాడి లీజులు, అద్దెలను కూడా ఖరారు చేసుకొంటున్నారంటే ఎంత స్పీడ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
షాప్‌లా? వాకిన్ స్టోర్‌లా?
కూటమి ప్రభుత్వం సెప్టెంబర్‌లో మద్యం పాలసీని ప్రకటించాల్సి ఉంది. బార్‌ల లైసెన్స్‌లు అప్పటితో ముగుస్తున్నందున అప్పుడే రెన్యూవల్ చేయాలి. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట విశాఖలో కొత్తగా 120 బార్‌లకు అనుమతులిచ్చేసింది. అవసరానికి మించి బార్‌లు ఏర్పాటు చేయడంతో మెజారిటీ బార్‌లు ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైన్ షాపులను గతంలో మాదిరిగా ప్రభుత్వమే నడిపి, కొత్తగా వాకిన్ స్టోర్‌లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, షాపులు లేదంటే వాకిన్ స్టోర్‌లు జేజిక్కొంచుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా వైన్ వ్యాపారం ప్రభుత్వం నుంచి బయటకు వస్తుందన్న నమ్మకంతో సదరు ప్రజా ప్రతినిధి హడావిడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పాలసీ ప్రకటించిన వెంటనే విశాఖ అంతటా తన షాపులే ఉండేలా పావులు కదుపుతున్నారు.