ఏపీ అప్పులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-07-31 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అటు టీడీపీ ఇటు బీజేపీ మరోవైపు జనసేన ఇంకోవైపు వామపక్షాలు ఇదే అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని తెల్లార్లు ఉతికి ఆరేస్తున్నాయి. అయితే గతంలో టీడీపీకంటే తక్కువ అప్పులు చేశామని వైసీపీ చెప్పుకొస్తున్నా వినడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అయితే వైసీపీని అప్పుల పేరుతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఏపీ అప్పులపై ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు సైతం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుల అంశం ఏపీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తోందని ఆరోపించారు. అప్పులకు సంబంధించి అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

కేంద్రమంత్రి వివరణ ఇదే

ఏపీ అప్పులపై ఇప్పటికే ఓ సారి క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వం అప్పుల పద్దును మరోసారి క్లారిటీగా పార్లమెంట్‌లో వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంటే 2019 మార్చి నాటికి ఏపీ అప్పు రూ.2,64,451 కోట్లు అని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య రూ.4,42,442 కోట్లకు చేరుకుందని సమాధానంగా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.1,77,991 కోట్లుగా నిర్మల పార్లమెంటులో వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎం పరిమితిని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఆర్ధిక సంఘం సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఏపీ ఆర్ధిక పరిస్దితి ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానంతో వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అప్పులపై ఇష్టం వచ్చినట్లు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని వైసీపీ మండిపడుతుంది.కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానంతో ఏపీ త్వరలో మరో శ్రీలంక కాబోతుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేసినట్లేనని వైసీపీ చెప్తోంది.

Tags:    

Similar News