తిరుమల లడ్డూ వివాదంపై నేడు తిరుమలలో సిట్ విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు ఏర్పాటైన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు ఏర్పాటైన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని.. జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ విచారణ జరుపనుంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంలో విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎవరెవరిని ప్రశ్నించనున్నారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. విచారణ తీరుతెన్నులపై ఇప్పటికే డీజీపీతో చర్చించిన సిట్..విచారణ క్రమంలో తొలుత ఏఆర్ డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపునుంది.
నెయ్యి టెండర్ల వ్యవరంపై మాజీ ఈవో, మాజీ చైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు.. టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు... సరఫరా కంపెనీల సామర్థ్యాలు.. నెయ్యిపై గతంలోనూ, తాజాగా వచ్చిన రిపోర్టులను సిట్ విచారించనుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ మొదలు పెట్టనుంది. లడ్డూ తయారీ సిబ్బందిని కూడా సిట్ ప్రశ్నించనుంది. లడ్డూ కల్తీ విచారణ నేపథ్యంలో ఈ పాపానికి కారణమైన నిందితులకు శిక్ష పడాల్సిందేనంటూ వెంకన్న భక్తుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.