4 వేల మంది కార్మికుల తొలగింపు.. విశాఖ స్టిల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది....
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే కార్మికులపై యాజమాన్యం వేటు వేసింది. 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల(Contract workers)ను తొలగించింది. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉత్పతి తగ్గిందని, అందుకే కార్మికులను తొలగించామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో స్టీల్ ప్లాంట్ లోపల కార్మికులు ఆందోళనకు దిగారు. మ్యాన్ పవర్‌ను తగ్గించడంపై అటు స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ (Steel Plant Porata Committee) సైతం అగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తామని చెప్పి, అకస్మాత్తుగా కాంట్రాక్ట్ కార్మికులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్‌కు నష్టాలను చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 1500 మందిని తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టిల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామంటూనే కేంద్రప్రభుత్వం కార్మికుల కడుపుగొడుతోందని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఏ ఒక్క కార్మికులను తీసి వేసినా ఒప్పుకునేది లేదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.