చర్చనీయాంశమైనPawan kalyan బస్సుయాత్ర నినాదం?
ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ అనంతరం జన సైనికుల్లో స్తబ్దత నెలకొంది.
ప్రధాని మోడీతో పవన్ కల్యాణ్ భేటీ అనంతరం జన సైనికుల్లో స్తబ్దత నెలకొంది. ప్రధానితో మాట్లాడి బయటకు వచ్చాక కర్ర విరగకుండా.. పాము చావకుండా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని జనసేనాని చెప్పారు. టీడీపీ అధినేత కర్నూలు జిల్లా పర్యటనలో తనకు చివరిసారిగా అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లబ్ది చేకూరితేనే తమకు ఓటువేసి మరోసారి అవకాశమివ్వాలని సీఎం జగన్అడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని పవన్ జనవరి నుంచి చేపట్టే యాత్రలో అడగాలనుకుంటున్నట్లు జన సైనికుల్లో వినిపిస్తోంది. ప్రజలు ఏమేరకు రిసీవ్ చేసుకుంటారనే దానిపై జనసేన నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను ముందు పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇవ్వాలని నాడు ప్రజలను అడిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై సానుభూతి కావొచ్చు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత అవ్వొచ్చు. వివిధ వర్గాలకు జగన్ఇచ్చిన హామీలైతేనేమి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగినందుకు సానుకూలంగా స్పందించారు. గత ఎన్నికల్లో వైసీపీకి అప్రతిహత విజయాన్ని అందించారు. అదే ఫార్ములాను ఇప్పుడు పవన్ప్రయోగిస్తే సానుకూల ఫలితాలు వస్తాయా రావా అనేది జనసేన నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. జగన్ సర్కారుపై ప్రజల వ్యతిరేకత చీలితే అది ఏమేరకు తమకు లబ్ది చేకూరుస్తుందనే ఆలోచన జన సైనికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పవన్ మౌనంతో కాపు నేతల కలత...
జనసేనలో ఎక్కువ మంది కాపు నేతలు టీడీపీతో పొత్తు ఉంటే తమ భవిష్యత్తుకు ఢోకా లేదని ఇప్పటిదాకా భావించారు. టీడీపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు సిద్దమని ప్రకటించినప్పుడు ఇక తాము ఎమ్మెల్యేగా గెలిచినట్లేనని సంబరపడ్డారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న నేతలకు ప్రధానితో భేటీ అనంతరం పవన్ మౌనం మింగుడుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడిగినా ప్రజల నుంచి ఆశించినంత సానుకూలత రాకపోవచ్చని మథనపడుతున్నారు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచి ప్రచారం చేసినా కనీసం కొన్ని సీట్లయినా గెలవగలమా అనే ఆందోళన వారిలో నెలకొంది.
వైసీపీలోని కాపునేతలు ఏమంటున్నారంటే...
ఇదే తరుణంలో పవన్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని వైసీపీలోని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. వైసీపీ కాపులకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసినా గెలవలేమని భావించే కాపు నేతలకు గాలం వేసే పనిలో వైసీపీ నాయకులున్నారు. ఈపాటికే టీడీపీలో పోటీ ఎక్కువగా ఉండి జనసేనలో కర్చీఫ్ వేసిన నేతలు కంగారు పడుతున్నారు. టీడీపీతో పవన్ పొత్తు లేకుంటే తమ పరిస్థితి ఏమిటనే గందరగోళంలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని పంచుకోవాలనే బలీయమైన కోరికను ఇప్పటిదాకా పవన్ కాపుల్లో తీసుకొచ్చారు. టీడీపీతో కాకుండా కేవలం బీజేపీతో ఎన్నికలకు వెళ్తే ఈ ఆశలు అడియాసలు అవుతాయేమోన్న బెంగ నెలకొంది. పవన్ జనవరిలో చేపట్టే యాత్ర నాటికి ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది.. బీజేపీతో కలిసి ఒక్క చాన్స్ఇవ్వాలనే నినాదం అందుకుంటారా! టీడీపీతో కలిసి ఉమ్మడి పోరుకు సిద్దమవుతారా? అనేది స్పష్టత రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.