Polavaram:తగ్గని కొండవాగు ఉధృతి..కోతకు గురవుతున్న పట్టిసీమ ఫెర్రీ రేవు
పోలవరం మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు, రిజర్వాయర్లు చెరువులు పొంగి నిండి దిగువకు ప్రవహిస్తున్నాయి.
దిశ, పోలవరం:పోలవరం మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు, రిజర్వాయర్లు చెరువులు పొంగి నిండి దిగువకు ప్రవహిస్తున్నాయి. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొవ్వాడ కాలువ వరద జలాలు పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ నుంచి గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. వరద జలాల తాకిడికి పట్టిసీమ ఫెర్రీ రేవు భారీ స్థాయిలో కోతకు గురవుతోంది. దీనికి సమీపంలో ఉన్న సచివాలయం ప్రమాదం అంచుల్లోకి చేరింది. మరోవైపు సోమవారం ఉదయం మండలం లో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. గుంజవరం, పేడ్రాల కాలువలు, కొండవాగుల జలాలు పొంగి గుంజవరం కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్నాయి.
ఎల్లండీపేట రిజర్వాయర్ లోకి కొండవాగుల జలాలు వచ్చి చేరడంతో రిజర్వాయర్ నుండి 221 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాధనాల కొండలరావు చేశారు. కొండవాగుల జలాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొవ్వాడ వరద జలాలు పట్టిసీమ అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి . గోదావరి నీటిమట్టం కడమ్మ స్లూయిజ్ గేట్లను పూర్తిగా ముంచెత్తడంతో కొండ వాగుల జలాలు గోదావరిలోకి వెళ్ళే వీలులేక పంట పొలాలు నీటమునిగాయి. సుమారు 600 ఎకరాల వరి నాట్లు నీటమునిగాయి. గోదావరి వరద జలాలు పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళే ప్రధాన మార్గమైన కడమ్మ వంతెనను తాకుతూ ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం పెరిగితే వంతెన నీటమునిగే అవకాశాలున్నాయి.