టీడీపీలో ఆళ్ల నాని చేరడానికి లైన్ క్లియర్
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొద్ది రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి.
దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొద్ది రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు వీల్లేదంటూ ఎమ్మెల్యే బడేటి చంటి వర్గీయులు వ్యతిరేకించారు. కాగా, నాని సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల మధ్య మంగళవారం ఎమ్మెల్యే బడేటి చంటి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందన తెలియజేయడంతో ఆళ్ల నానికి లైన్ క్లియర్ అయింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ బాబు సమక్షంలో నాని టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని స్పష్టమైంది.
అసంతృప్తి అధిష్టానం దృష్టికి: ఎమ్మెల్యే చంటి
ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంటి మాట్లాడుతూ అధిష్టానం నాని చేరిక విషయంలో సుముఖంగా ఉందని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆళ్ల నాని చేరికను సుహృద్భావ వాతావరణంలోనే స్వాగతిస్తున్నామని, ఈ విషయంలో విభేదాలకు తావులేదని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు ఆళ్ల నాని చేరికపై గత కొంతకాలంగా పార్టీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారని, అది వారిలో నెలకొన్న అసంతృప్తితో కూడిన భావావేశమని పేర్కొన్నారు. కార్యకర్తల భావ స్వేచ్ఛకు తానెప్పుడూ అత్యధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. దీంతో కార్యకర్తల ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. కానీ ఆళ్ల నాని చేరికకు అధిష్టానం సుముఖంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కొల్లేపల్లి రాజు, ఎస్సెమ్మార్ పెదబాబు, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పెద్దిబోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, ఆర్నేపల్లి తిరుపతి, నాయుడు సోము తదితరులు పాల్గొన్నారు.