పైప్డ్ గ్యాస్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి: ప్రతిపాదనలు అందజేసిన ఆయిల్ కంపెనీ

ఏపీ రాజధాని అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ...

Update: 2024-12-17 17:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. కేంద్రం, బ్యాంకులు విడుదల చేసే నిధులతో నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దూకుడు పెంచింది. దేశంలోనే మొత్తం పైప్డ్ గ్యాస్ వినియోగించే రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యులు ఎ.రమణ కుమార్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంగ‌ళ‌వారం రాష్ట్ర సీఎస్ నీర‌భ్‌కుమార్ ప్రసాద్‌ను కలిశారు. తమ ప్రతిపాదనలు అందజేశారు. అలాగే రాష్ట్రంలో తాము చేప‌డుతున్న గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, త‌దిత‌ర ప్రాజెక్టులపై చ‌ర్చించారు.

గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్ జిల్లాలోని గుజ‌రాత్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిన్‌-టెక్ సిటీ (గిఫ్ట్‌) న‌గ‌రంలో గ్యాస్ మొద‌లు విద్యుత్తు, టెలీకాం కేబుళ్ల వ‌ర‌కు అన్నీ కూడా అండ‌ర్ గ్రౌండ్‌లో ఉంటాయని, అక్కడ ఆవాసాల‌కు, వ్యాపార స‌ముదాయ‌ల‌కు, సంస్థలు అన్నిటికీ కూడా పూర్తి పైప్డ్ గ్యాస్ అందించ‌బ‌డుతోంద‌ని సీఎస్ కు వివరించారు. అదే త‌ర‌హాలో దేశంలో మొట్టమొద‌టి పైప్డ్ గ్యాస్ రాజ‌ధానిగా చేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని పీఎన్‌జీఆర్బీ ప్రతినిధులు తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ప్రతినిధుల బృందానికి సీఎస్ తెలిపారు.

Tags:    

Similar News