పవన్ ఎంట్రీతో డిఫెన్స్‌లో వైసీపీ.. జగన్ ప్లాన్ అర్థంకాక ఆందోళనలో శ్రేణులు
చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపామన్న సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఆవిరవుతోంది...
దిశ, ఏపీ బ్యూరో: చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపామన్న సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఆవిరవుతోంది. టీడీపీ అధినేతతోపాటు మరికొందర్ని కేసుల్లో ఇరికించి కటకటాల వెనక్కి పంపిస్తున్నారనే ప్రచారం మరింత కలవరపెడుతోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న మీమాంసలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.
లండన్ పర్యటనకు ముందే ప్లాన్?
సీఎం జగన్ లండన్ పర్యటన పెట్టుకోకముందే చంద్రబాబు అరెస్టుకు ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చంద్రబాబును అరెస్టు చేస్తే అది బీజేపీ మీదకు పోతుంది. అందుకే సీఐడీతో పని కానిచ్చేసినట్లు అవగతమవుతోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అర్థం వచ్చేలా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లినా.. చంద్రబాబు అరెస్టు సీఎం జగన్ చేయించారనే ముద్ర పడింది. ఈ ప్రచారం ఎన్నికల్లో తమకు నష్టం కలిగిస్తుందని వైసీపీ శ్రేణులు మదనపడుతున్నాయి.
లాభమా? నష్టమా?
ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై మోపిన కేసుల విషయంలో ముందుకెళ్తే లాభమా.. నష్టమా అనే మీమాంసలో పడింది. పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కలిస్తే తాము ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈపాటికే కొన్ని వర్గాల్లో ఓటు బ్యాంకులను సుస్థిరం చేసుకున్న వైసీపీ తాజా పరిస్థితులపై లోతుగా పరిశీలిస్తోంది. ఒకవేళ బీజేపీతో కలిసి పవన్, చంద్రబాబు పోటీ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారు.
గెలుపుకోసం సర్వశక్తులూ...
మరోసారి వైసీపీ జెండా ఎగరేయడానికి సీఎం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కేంద్రం నుంచి ఎప్పటి మాదిరిగానే సహకారం అందుతుందనే భావనలో ఉన్నారు. బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్‌లో తాము పావులు కాకుండా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. మూడు పార్టీలు కలిసొస్తాయా.. లేక రెండు పార్టీలతోనే తలపడాలా అనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. క్లారిటీ వచ్చే దాకా ఆగి తదుపరి తగు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం జగన్ ముఖ్య నేతలకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఈలోగా గెలుపు కోసం చేపట్టిన అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.