ఇచ్చిన హామీ మేరకు విశాఖ అగనంపూడిలో టోల్ గేట్ ఎత్తేసిన కూటమి ప్రభుత్వం
ఇంతకాలం వైసీపీ నేతల కుమ్మక్కు, బీజేపీ నేతల అసమర్ధతతో అక్రమంగా నడిచిన విశాఖవాసులపై వందల కోట్ల భారం వేసిన విశాఖ నగర శివారులోని అగనంపూడి టోల్ గేట్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనభ్యుడు పల్లా శ్రీనివాస్ జోక్యంతో తొలగిపోయింది.
దిశ ప్రతినిది, విశాఖపట్నం: ఇంతకాలం వైసీపీ నేతల కుమ్మక్కు, బీజేపీ నేతల అసమర్ధతతో అక్రమంగా నడిచిన విశాఖవాసులపై వందల కోట్ల భారం వేసిన విశాఖ నగర శివారులోని అగనంపూడి టోల్ గేట్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనభ్యుడు పల్లా శ్రీనివాస్ జోక్యంతో తొలగిపోయింది. అనకాపల్లి- అనందపురం మధ్య విశాఖనగరంలోనుంచి వెళ్లే ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా పెందుర్తి మీదుగా మరో రహదారిని నిర్మించి అక్కడ రెండు టోల్ కలెక్షన్ పాయింట్ లు ఏర్పాటుచేసిన తరువాత కూడా వైసీపీ నేతల కుమ్మక్కుతో ఈ టోల్ గేట్ నడిచింది. 2014-19 మధ్య పల్లా శ్రీనివాస్ శాసనసభ్యుడిగా ఉండగా కేసు వేయించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ టోల్ గేట్ ను తొలగింపజేశారు. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కొందరు ప్రజా ప్రతినిధులు టోల్ మాఫియాతో కుమ్మక్కై నెల వారీ మామూళ్లు అందుకోని మరో కోర్టు ఆర్డర్ ఆధారంగా తిరిగి తెరిపించారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ కేసు జోలికి పోకుండా, అక్రమ టోల్ గేట్ విషయం ఎక్కడా మాట్లాడకుండా వాటాలు తీసుకొని తమ దోపిడీని కొనసాగించారు.
ఈ టోల్ గేట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందంటూ ఆ మధ్య కాలంలో పల్లా శ్రీనివాస్ ఉద్యమం చేశారు. జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ దోపిడీ తీరును వివరిస్తూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి కేంద్ర రహదారి విభాగం ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వీటన్నింటినీ పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర అధికారులు ఇక్కడ ప్రభుత్వం మారడం రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేతలు టోల్ గేట్ వద్ద ఆందోళనకు దిగి వాహనాలను టోల్ లేకుండా పంపించేయడంతో ఒత్తిడి పెరిగింది. తాను గెలిస్తే టోల్ గేట్ తొలగిపోతుందని హామీ ఇచ్చిన పల్లా శ్రీనివాస్ సంబంధిత ఎన్ హెచ్ ఏ ఐ అధికారులతో మాట్లాడడంతో గురువారం ఉదయం టోల్ గేట్ ను పూర్తిగా తొలగించారు. టోల్ బూత్ లు కూడా తొలగించడంతో వాహనాలు స్వేచ్చగా వెళ్లిపోతున్నాయి.