ముగిసిన సమన్వయ కమిటీ సమావేశం.. భారీ బహిరంగ సభ ఆరోజే..!
ఎన్నికల పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన పలు అంశాలపై చర్చించేందుకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు
దిశ డైనమిక్ బ్యూరో: ఎన్నికల పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన పలు అంశాలపై చర్చించేందుకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..దేశ చరిత్రలో ఇంత చెత్త సీఎంని చూడలేదని, ప్రజల శ్రేయస్సు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ఒక సైకోలా వ్యవస్థలన్ని చిన్నభిన్నం చేశారని, దేశంలో తెలుగు వారన్న, ఏపీ ప్రజలన్నా చిన్న చూపు చేసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు రోడ్లపై తిరగలేని పరిస్థితి వచ్చిందని, అలాగే ప్రజలు సమస్యలు చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఈ పరిస్థితులు అన్ని చూశాక, ఇటువంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రిగా కాకుడదు అని ధ్యేయంగా టీడీపీ, జనసేన కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయన్నారు.
ఎన్నికల సంగ్రామం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంగా ఇరుపార్టీలు కలిసి ఉమ్మడిగా సభ పెట్టాలని నిర్ణయించుకున్నామని, అది ఈ నెల 28న తాడేపల్లిగుడెం పక్కన పత్తిపాడు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సభ నిర్వహణ కొరకు రెండు పార్టీల నుంచి 12 మందిని కమిటీగా వేసి, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సభకు ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మేదావులు, ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వల్ల బాధింపబడ్డ ప్రతీఒక్కరినీ సభకు హాజరయ్యి విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఉమ్మడి మేనిఫెస్టొపై ఇప్పటికే కమిటీ వేశామని, కమిటీ 3 పర్యాయాలు సమావేశం అయ్యిందని, ఈ లోపు టీడీపీ సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, త్వరలోనే ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే టికెట్ల విషయానికి వస్తే.. ఇరు పార్టీల అధినేతలదే తుది నిర్ణయమని.. వారే టికెట్లపై చర్చించి ప్రకటిస్తారని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేఖత ఏర్పడిందని, ఓడిపోతామని తెలిసే చివరి ప్రయత్నంగా అల్లకల్లోళం సృష్టంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మీడియాపై దాడులు కూడా చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేసి, రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని హెచ్చరించారు. ఇక టీడీపీ, జనసేన పార్టీల పొత్తును చూసి ఒర్వలేని వైసీపీ నాయకులు, ఇరు పార్టీల మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తున్నారని, వారికి గట్టి సమాధానం చెప్పేలా మేము కలిసి పనిచేస్తామని తెలిపారు.